రాష్ట్రంలో రాజకీయ పవనాలు మారుతున్నాయి. నాయకులు ఒక్కొక్కరుగా తమ దారి తాము చూసుకుంటున్నారు. మా నేత మారతాడనే అనుకుంటున్నాం. మారకపోతే.. అప్పుడు చూస్తాను అని కొన్నాళ్ల కిందట ఆన్‌లైన్ చానెల్‌తో మాట్లాడుతూ.. చెప్పిన కీలక నాయకుడు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఒకరు ఇప్పుడు మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతున్న దరిమిలా.. ఆయన తన దారి తాను చూసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జనసేనలోకి ఆయన అడుగులు పడుతున్నట్టు తెలిసింది.
ఎవరు? ఎక్కడ?
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో కీలకమైన నాయకుడిగా ఎదిగిన మానుగుంట మహీధర్‌రెడ్డికి సుదీర్ఘ రాజకీయ ప్రస్తానం ఉంది. తండ్రి ఆదినారాయణరెడ్డి వారసత్వంగా మానుగుంట రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మహీధర్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఉండగా.. వరుస విజయాలు దక్కించుకుని మంత్రి కూడా అయ్యారు. తర్వాత.. ఒక దశలో ఆయనకు టికెట్ దక్కకపోతే.. పార్టీనిఎదిరించి ఇండిపెండెంటుగా పోటీ చేశారు. ఈ క్రమంలోనే 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మానుగుంట.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.
తర్వాత.. 2018లో వైసీపీలో చేరారు. ఆది నుంచి టీడీపీతో విభేదించే మానుగుంట కుటుంబం.. ఆ పార్టీవైపు ఎప్పుడూ చూడలేదు. 2019 ఎన్నికల్లో కందుకూరు నుంచి విజయం దక్కించుకున్న మానుగుంట మంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, జగన్ అవకాశం ఇవ్వలేదు. ఇక, 2024 వరకు కూడా తనకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందన్న ఆవేదనలోనే మానుగుంట మిగిలారు. చివరకు 2024 ఎన్నికల్లో మానుగుంటకు జగన్ టికెట్ కూడా ఇవ్వలేదు. ఆ సమయంలోనే పార్టీ మారాలని అనుకున్నా.. మౌనంగా ఉన్నారు. ఇక, పార్టీ ఓడిపోయిన దరిమిలా.. ఆయన జగన్ లో మార్పు కోసం ఎదురు చూసినట్టు పలు సందర్భాల్లో తెలిపారు.
అయితే.. వైసీపీ అధినేతలో మార్పు రాకపోగా.. నానాటికీ పార్టీ పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో మార్పు దిశగా మానుగుంట అడుగులు వేశారు. కందుకూరులో జనసేన కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుండడం.. ఉమ్మడి ప్రకాశంలో వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, జగన్‌కు దగ్గర బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జనసేనలోనే ఉండడం.. వంటి పరిణామాల క్రమంలో మానుగుంట ఇప్పుడు జనసేనవైపు చూస్తున్నారని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. వివాద రహితుడు కావడం.. సుదీర్ఘ రాజకీయ అనుభవం.. వంటివి ఉన్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ కూడా..ఆయన రాకను స్వాగతించే అవకాశం ఉందన్న చర్చ ఉంది. జనసేన నాయకులతో ప్రస్తుతం మానుగుంట చర్చల్లో ఉన్నారు. వీటిని ఫైనల్ చేయగానే ఆయన చేరిక ఖాయమని తెలుస్తోంది.