భారత ప్రధాని నరేంద్ర మోదీ, టెక్ దిగ్గజం టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ మధ్య తాజాగా జరిగిన ఫోన్ సంభాషణ భారత టెక్నాలజీ రంగంలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. గతంలో జూన్‌లో అమెరికా పర్యటనలో మోదీ, మస్క్ సమావేశమై ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్ష పరిశోధన వంటి అంశాలపై చర్చించారు. ఇప్పుడు మళ్లీ వీరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఆ అంశాలపై మరింత స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సంభాషణ అనంతరం మస్క్ స్వయంగా భారత పర్యటన విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. “ఈ ఏడాది చివర్లో భారత్‌కు రావాలని ఎదురుచూస్తున్నాను” అని ట్వీట్ చేశారు. మోదీతో జరిగిన సంభాషణపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల టెస్లా కంపెనీకి భారత్‌లో పెట్టుబడులు, కార్యాచరణ ప్రారంభించేందుకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు, భారత్‌లో ఇప్పటికే టెస్లా సంస్థ అడుగులు వేస్తోంది. ఇటీవల ముంబై నగరంలో టెస్లా తన మొదటి షోరూమ్ ఏర్పాటుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో భారత్‌లో టెస్లా ఎంట్రీ ఖరారైనట్టేనని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముంబైలో టెస్లా మోడల్ Y కారును టెస్ట్ డ్రైవ్ నిర్వహిస్తున్న వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మస్క్ స్వయంగా భారత్‌కు వస్తానని ప్రకటించడం టెస్లా కోసం మరింత ప్రచారాన్ని కలిగించింది.
అలాగే, భారత్‌లో ‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్ సేవల కోసం కూడా మస్క్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ సేవల అనుమతుల కోసం భారత్ ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. ప్రధానితో మస్క్ తాజా సంభాషణ, ఆయన స్వయంగా భారత్‌కు వస్తున్నారని ప్రకటించడం ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న తరుణంలో మస్క్ పర్యటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పరిణామాలన్నీ భారత్ టెక్నాలజీ రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతాయా ఈ పర్యటనతో మస్క్ ఎలాంటి కొత్త ప్రకటనలు చేస్తారు అన్న అంశాలపై పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates