అమెరికాలో భారత విద్యార్థులకు బిగ్ షాక్: వీసాల రద్దుపై కలకలం

అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులపై కొత్త ఆంక్షలు పడుతున్నాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఇది ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలతో దాదాపు 327 మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దయ్యాయి. అతి కీలకమైన ఎస్ఈవీఐఎస్ (SEVIS) రికార్డులను కూడా తొలగించడంతో విద్యార్థులు న్యాయపోరాటానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ రద్దయిన వీసాల సంఖ్యలో సగం మంది భారతీయులే ఉన్నారని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (AILA) పేర్కొంది. వీసా రద్దు చేసిన విద్యార్థుల్లో 14 శాతం చైనా దేశానికి చెందిన వారు కాగా, మిగతా వారు దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలవారు. ఎలాంటి స్పష్టత లేకుండా వీసాలను రద్దు చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని ఎయిలా హితవు పలికింది.

ఈ చర్యలపై పారదర్శకత ఉండాల్సిందని, తప్పుగా తొలగించిన ఎస్ఈవీఐఎస్ రికార్డులపై విద్యార్థులకు విన్నవించుకునే అవకాశం కల్పించాలని అసోసియేషన్ సూచించింది. ఇప్పటికే మాసాచుసెట్స్, మోంటానా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, వాషింగ్టన్ డీసీ వంటి రాష్ట్రాల్లోని న్యాయమూర్తులు విద్యార్థుల హక్కులను రక్షిస్తూ తాత్కాలిక ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాలు కొన్ని వీసా రద్దులను నిలిపివేసే దిశగా మారాయి.

ప్రస్తుతం దాదాపు 21 ఏళ్ల క్రిష్ ఇస్సర్‌దాసాని అనే భారతీయ విద్యార్థి కేసు అమెరికాలో హాట్ టాపిక్ అయింది. విస్కాన్సిన్‌లోని ఓ బార్‌ దగ్గర జరిగిన ఓ చిన్న గొడవ కారణంగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ కేసు లేకుండానే ఏప్రిల్ 4న అతడి ఎస్ఈవీఐఎస్ రికార్డును యూనివర్సిటీ రద్దు చేసింది. ఇది చట్ట విరుద్ధమని న్యాయమూర్తి పేర్కొనడం మరింత చర్చకు దారి తీసింది.

ఇలాంటి నిర్ణయాల వల్ల అమెరికాలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడే ప్రమాదం ఉంది. ట్రంప్ పాలనలో వీసా వ్యవహారాలు మరింత కఠినంగా మారుతుండడంతో, భారత ప్రభుత్వం కూడా ఈ అంశంపై స్పందించే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఈ వ్యవహారంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది.