ఐపీఎల్‌లో ముంబయితో సమానంగా ఐదుసార్లు విజేతగా నిలిచిన జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్. ముంబయి కంటే ఎక్కువగా ఫైనల్స్ ఆడిన, ప్లేఆఫ్స్ దాటిన నేపథ్యంలో ఆ జట్టును మోస్ట్ సక్సెస్ ఫుల్ టీంగానూ చెప్పొచ్చు. అంత ఘన చరిత్ర ఉన్న జట్టు.. ఈ సీజన్ల పేలవ ప్రదర్శన చేస్తోంది. విజయంతో సీజన్‌ను ఆరంభించిన ఆ జట్టు.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.
చెన్నై నాలుగో ఓటమిలో ప్రియాంశ్ ఆర్య అనే కుర్రాడు ముఖ్య పాత్ర పోషించాడు. ఢిల్లీకి చెందిన ఈ 24 ఏళ్ల కుర్రాడిని వేలంలో రూ.3.8 కోట్లకు కొనుక్కుంది పంజాబ్ జట్టు. ఈసారి ఐపీఎల్ ఆరంభానికి ముందు జరిగిన ఢిల్లీ ప్రిమియర్ లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడమే కాక.. 50 బంతుల్లోనే 120 పరుగులు సాధించాడతను.
ఈ కుర్రాడి ప్రతిభను గుర్తించిన చెన్నై సూపర్ కింగ్స్ టాలెంట్ స్కౌట్ కోచ్ ఒకరు.. జట్టు యాజమాన్యానికి తన గురించి చెప్పాడట. వేలంలో అతణ్ని కొనుక్కోమని సూచించాడట. కానీ చెన్నై యాజమాన్యం మాత్రం ప్రియాంశ్‌ను వదిలేసి.. రాహుల్ త్రిపాఠిని ఎంచుకుంది. అతనీ సీజన్లో పేలవ ప్రదర్శన చేసి జట్టులో చోటు కోల్పోయాడు. పంజాబ్ సొంతమైన ప్రియాంశ్ మాత్రం తొలి మ్యాచ్‌లోనే 47 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
చెన్నై మీద ఇంకా చెలరేగిపోయిన అతను.. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ కొట్టి చెన్నైకి మ్యాచ్‌ను దూరం చేశాడు. ఈ మ్యాచ్ జరుగుతుండగానే ఒక వీడియో ఇంటర్వ్యూలో సదరు కోచ్.. చెన్నై యాజమాన్యం తన మాట వినకుండా ప్రియాంశ్‌ను ఎలా దూరం చేసుకుందో చెప్పాడు. దీంతో జట్టును సీనియర్ ఆటగాళ్లతో నింపి నాశనం చేస్తున్నారంటూ చెన్నై అభిమానులు యాజమాన్యాన్ని తిట్టిపోస్తున్నారు.