ఈ కండక్టర్ టికెట్లు కొట్టడం కష్టమే!

తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తున్న అమీన్ అహ్మద్ అన్సారీ నిజంగానే టికెట్లు కొట్టేందుకు పనికి రారు. టికెట్టు కొట్టడం ఆయనకు చేత కాదు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేయడం ఆయనకు అంతకంటే కూడా కష్టమేమీ కాదు. వచ్చిన చిక్కల్లా… తలను ఓ పక్కకు వేలాడేసి.. అలా సొరుగుతూ సొరుగుతూ బస్సులో ఆ చివర నుంచి ఈ చివర దాకా, ఈ చివర నుంచి ఆ చివర దాకా ఆయన పలుమార్లు తిరగడం చాలా కష్టంగా ఉందట.

నిజమేగా మరి… 10 గంటలకు పైగా తలను ఓ వైపునకు వాల్చేసి టికెట్లు కొట్టేది ఎలా? డబ్బులు తీసుకునేది ఎలా? అన్సారీ ఇబ్బందిని చూసిన ఓ నెటిజన్ ఆయన ఇబ్బంది పడుతున్న ఫొటోను తీసి సోషల్ మీడియాలో పెట్టేసి… కండక్టర్ ఉద్యోగం కాకుండా మరేదైనా కొలువును ఆయనకు ఇవ్వండని కోరారు. దీనికి తెలంగాణ సీఎం కార్యాలయం స్పందించింది. ఆ వెంటనే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వేగంగా స్పందించారు. ఆర్టీసీ ఎండీకి ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశాలూ జారీ చేశారు.

అయినా కండక్టర్ ఉద్యోగం చేయడానికి అన్సారీకి వచ్చిన ఇబ్బంది ఏమిటంటే… బస్సు లోపలి ఎత్తు 6.4 అడుగులు. అంటే 6.3 అడుగుల ఎత్తున్న వ్యక్తి కూడా కాస్త ఇబ్బంది పడక తప్పదు. అలాంటిది ఏకంగా 7 అడుగుల ఎత్తు ఉన్న అన్సారీ… బస్సులో అటూఇటూ కదలాలంటే తలను ఓ వైపునకు వాల్చాల్సిందే కదా. ఏ అరగంటో, గంటో అయితే ఫరవా లేదు గానీ.., నిత్యం 10 గంటల పాటు అలాగే సాగాలంటే ఇబ్బందే కదా. ఏం చేద్దాం? అన్సారీ చదివింది ఇంటర్ వరకే.

హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట పరిదిలోని షాహీ నగర్ అన్సారీ నివాసం ఉంటున్నారు. అన్సారీ తండ్రి ఆర్డీసీ కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవారు. అనారోగ్యం కారణంగా ఆయన 2021లో చనిపోయారట. కారణ్య నియామకం కింద ఇంటర్ చదివిన అన్సారీకి ఆర్టీసీ యాజమాన్యం కండక్టర్ ఉద్యోగం ఇచ్చింది. బతుకుదెరువు కోసం కండక్టర్ ఉద్యోగంలో అన్సారీ చేరిపోయారు. అయితే అప్పుడే అన్సారీకి అసలు సమస్య ఎదురైంది.

బస్సులోకి ఎక్కినంతనే అన్సారీ తలను ఏదో ఒక వైపునకు వాల్చేసి కదలాల్సి వస్తోంది. మెడను నిటారుగా పెట్టేసి సాగడం అస్సలు కుదరడం లేదు. ఫలితంగా మెడ నొప్పి, వెన్ను నొప్పి… వాటి ఫలితంగా నిద్ర లేమి మొదలైంది. ఈ నొప్పుల ఉపశమనానికి అన్సారీ విధులు ముగిసిన తర్వాత ఆసుపత్రుల చుట్టూ తిరగక తప్పడం లేదు. బస్సులో ఆయన వాలకం చూసి ఆరా తీస్తే ఈ విషయమంతా బయటకు రాగా… బస్సులో తల ఓ పక్కకు వాల్చేసి నిలుచున్న అన్సారీ ఫొటో, దాని కింద ఆయన ఇబ్బందిని ప్రస్తావిస్తూ ఏపీకి చెందిన ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

ఈ పోస్టు చూసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం స్పందించింది. సీఎంఓ ఆదేశాలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ కు ఓ ఆదేశం జారీ చేశారు. అన్సారీ ఎత్తును దృష్టిలో పెట్టుకుని ఆయనకు సరిపడే ఇతర ఉద్యోగాన్ని కేటాయించాలని ఆ ఆదేశంలో మంత్రి సూచించారట. నేరుగా మంత్రి నుంచే ఆదేశం రావడంతో రేపో, మాపో అన్సారీ కండక్టర్ ఉద్యోగాన్ని వదిలి వేరే కొలువుకు వెళ్లే అవకాశాలైతే ఉన్నాయని చెప్పవచ్చు.