ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్టాక్ మార్కెట్లు ఎలా స్పందిస్తున్నాయో తెలిసిందే.ఆయన తీసుకుంటున్న దూకుడు నిర్ణయాల కారణంగా స్టాక్ మార్కెట్ ఆగమాగం అవుతోంది. ఓవైపు యుద్ధ భయాలు. మరోవైపు ట్రంప్ ప్రతీకార సుంకాల హెచ్చరికలతో ప్రపంచంలో తోపు కంపెనీల షేర్లు సైతం దారుణంగా నష్టపోవటం తెలిసిందే. దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటూ.. నష్టాల బాట పట్టిన సంగతి తెలిసిందే.
దీంతో ప్రపంచ కుబేరుల సంపద మీద కూడా ప్రభావం చూపింది. అయితే.. ఇంత పతనంలోనూ అమెరికా దిగ్గజ మదుపరి వారెన్ బఫెట్ సంపద మాత్రం ఏకంగా రూ.1.10 లక్షల కోట్లు పెరగటం గమనార్హం. ఎందుకిలా అంటే.. ఆయన అంచనాలు దీర్ఘకాలం ఉండటంతో పాటు.. సమీప భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై ఆయనకున్న విజన్ ఈ మేజిక్ కు సాధ్యమైందని చెబుతున్నారు.
అమెరికాలో చోటు చేసుకునే రాజకీయ పరిణామాల్ని గుర్తించిన బఫెట్.. తెలివిగా అక్కడి దిగ్గజ కంపెనీల్లో తనకున్న వాటాల్ని అమ్మేసిన ఆయన.. జపాన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటంతో బఫెట్ సంస్థ సంపద భారీగా పెరగటానికి కారణమైనట్లుగా గుర్తించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టాక్ మార్కెట్ విలువ ఏకంగా రూ.688 లక్షల కోట్లు (8 లక్షల కోట్ల డాలర్లు) ఆవిరైంది. ఇందులో సింహ భాగం వివిధ దేశాల్లో విధించే ప్రతీకార సుంకాల ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే నష్టపోవటం గమనార్హం.
కొవిడ్ సంక్షోభం తర్వాత ఒక్క రోజులో భారీగా (329 బిలియన్ డాలర్లు) స్టాక్స్ నష్టపోయిన మొదటి సందర్భం ఇదే. ప్రపంచంలోని టాప్ 500 మందది అగ్ర కుబేరుల సంపద గురువారం ఒక్క రోజే రూ.17.73 లక్షల కోట్లకు తగ్గింది. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం కొవిడ్ తర్వాత ఈ స్థాయిలో సంపదను కోల్పోవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు టాప్ బిలియనీర్ల సంపద ఎంత తగ్గిందన్నది చూస్తే..
- ఎలాన్ మస్క్ 130 బిలియన్ డాలర్లు
- జెఫ్ బెజోస్ 45.2 బిలియన్ డాలర్లు
- జుకర్ బర్గ్ 28.1 బిలియన్ డాలర్లు
- బెర్నార్డ్ ఆర్నాల్డ్ 18.6 బిలియన్ డాలర్లు
- బిల్ గేట్స్ 3.38 బిలియన్ డాలర్లు
తోపుల్లాంటి కుబేరుల ఆస్తులు ఇంతలా దెబ్బ తింటే.. అందుకు భిన్నంగా వారెన్ బఫెట్ మాత్రం యాపిల్.. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉన్న తన వాటాల్ని తగ్గించుకుంది. నగదు నిల్వల్ని పెంచుకొని.. ఆ నిధులను జపాన్ కు చెందిన మిత్సుయ్.. మిత్సుబిషి.. సుమిటోమో.. ఇటోచు.. మారుబెనిల్లో వాటాల్ని పెంచుకోవటంపై ఫోకస్ చేసింది. ఆ ప్లాన్ కాస్తా వర్కువుట్ కావటటంతో భారీగా లాభపడ్డారు. బఫెట్ తో అలానే ఉంటుంది మరి.