ట్రంప్‌ సుంకాలు.. అమెరికాకు మేలా, ముప్పా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఇప్పటికే ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ చేసిన తాజా అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుత స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు (GDP) 1.3 శాతంగా ఉన్న అమెరికా, ఈ ఏడాది చివరి నాటికి మైనస్ 0.3 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని జేపీ మోర్గాన్‌ చీఫ్‌ ఎకనామిస్ట్ మైఖేల్ ఫెరోలి తెలిపారు.

ఈ పరిణామాల వల్ల అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశం ఉందని ఆ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా ట్రంప్ విధించిన భారీ దిగుమతి సుంకాల వల్ల వినియోగదారుల ఖర్చు పెరిగి, కంపెనీల లాభాలు తగ్గి, ఉద్యోగ నియామకాలు మందగించనున్నట్లు అంచనా. దీంతో నిరుద్యోగిత పెరుగుతుందని సూచిస్తోంది. గతంలో 4.2 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు త్వరలో 5.3 శాతానికి చేరే అవకాశముందని జేపీ మోర్గాన్ స్పష్టం చేసింది. ఇది అమెరికా కష్టాల్లో ఉన్నదనే సంకేతాన్ని స్పష్టంగా ఇస్తోంది.

అంతేకాదు, ఇతర ఆర్థిక నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ విధించిన టారిఫ్‌లు అమెరికాకు దిగుమతయ్యే వస్తువుల ధరలను పెంచే అవకాశముంది. దీంతో వినియోగదారులపై భారమైతే, మార్కెట్‌లో డిమాండ్ తగ్గుతుంది. దీనివల్ల మళ్లీ కంపెనీలు ఉద్యోగాలను తగ్గించేందుకు వెనుకాడవు. ఇక ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించవలసిన పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తంగా, ట్రంప్ ఆర్థిక విధానాల ప్రభావం అమెరికా ప్రజల జేబులపై స్పష్టంగా కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. అమెరికా షేర్ మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లపై కూడా ప్రభావం కనిపిస్తోంది. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడ ఎగుమతుల్లో నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ దీక్ష పన్నులతో ఉద్యోగాలు రాకపోతే, దీని పరిణామాలు ఆయన తిరిగి ఎన్నికలు ఎదుర్కోవడానికే సవాలుగా మారే అవకాశం ఉంది. మిగిలిన దేశాలు మౌనంగా ఉండకుండా అమెరికా చర్యలకు వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని మరికొందరు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.