‘300 సన్‌రైజర్స్‌’ను ఆడేసుకుంటున్నారు

సన్‌రైజర్స్ హైదరాబాద్.. గత ఏడాది ఐపీఎల్‌ను ఒక ఊపు ఊపేసిన జట్టు. అప్పటిదాకా ఈ లీగ్‌లో ఎన్నో బ్యాటింగ్ విధ్వంసాలు చూశాం కానీ.. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. పన్నెండేళ్ల పాటు నిలిచి ఉన్న ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును మూడుసార్లు దాటడం.. కేవలం 6 ఓవర్ల పవర్ ప్లేలోనే 125 పరుగులు చేయడం.. ఇలా మామూలు సంచలనాలు కావు సన్‌రైజర్స్‌వి. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే 286 పరుగులతో రెండో అత్యధిక స్కోరు నమోదు చేయడంతో ఆ జట్టు మీద అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. 300 స్కోర్ నమోదు కావడం లాంఛనమే అనే అభిప్రాయానికి వచ్చేశారంతా.

సన్‌రైజర్స్ ఆడిన తర్వాతి మ్యాచ్‌లకు హైప్ మామూలుగా లేదు. కానీ ఆ జట్టు వరుసగా బోల్తా కొడుతుండడం పెద్ద షాక్. ఒక మ్యాచ్‌లో 300 కొట్టడం పక్కన పెడితే.. గత రెండు మ్యాచ్‌ల స్కోర్లు కలిపినా మూడొందలు కాలేదు. గురువారం కోల్‌కతాతో మ్యాచ్‌లో మ్యాచ్‌లో మరీ దారుణంగా 120 పరుగులకే కుప్పకూలింది హైదరాబాద్ జట్టు.

మొన్నటిదాకా సన్‌రైజర్స్‌కు ఎక్కడ లేని ఎలివేషన్లు ఇచ్చిన సోషల్ మీడియా జనాలు ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయారు. ఆ జట్టును మామూలుగా ట్రోల్ చేయట్లేదు. సన్‌రైజర్స్ వైఫల్యం మీద అనేక తెలుగు సినిమాల సన్నివేశాలతో మీమ్స్ చేస్తున్నారు. అన్నింట్లోకి హైలైట్ అంటే.. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’లో మాఫియా డాన్ అయిన మురళీ శర్మను పృథ్వీ ఇంటరాగేట్ చేసే సీన్‌‌కు ముడిపెట్టి సన్‌రైజర్స్‌ను ఏకిపడేస్తున్నారు నెటిజన్లు.

స్కోర్ ఎంత అని అడిగితే.. గత సీజన్ విధ్వంసాల గురించి.. కాటేరమ్మ కొడుకులు ఎలివేషన్ల గురించి చెప్పడం.. 300 టార్గెట్ గురించి అని జవాబివ్వడం.. బదులుగా నేనడిగింది స్కోర్ ఎంత అంటూ వాయించడం.. ఇలా సాగే మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా పలు మీమ్స్ సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. మొత్తానికి ఎంతో హైప్‌తో ఈ సీజన్‌ను మొదలుపెట్టిన సన్‌రైజర్స్.. హ్యాట్రిక్ ఓటములతో ఇలా చతికిలపడడం ఊహించనిదే. మరి తర్వాతి మ్యాచ్‌తో అయినా ఈ ట్రోలింగ్‌కు తెరదించే ఆట ఆడుతుందేమో చూడాలి.