కోటీశ్వ‌రుడి కాలిన‌డ‌క‌.. ద్వార‌క‌కు అంబానీ త‌న‌యుడు!

ఆయ‌న కోటీశ్వ‌రుడి కుమారుడు. ఎండ‌క‌న్నెరుగ‌ని ఫ్యామిలీ. అయితే.. ఇప్పుడు కార‌ణాలు ఏవైనా.. కాలినడ‌క ప‌ట్టారు. ఏకంగా.. 140 కిలో మీట‌ర్ల దూరాన్ని పాద‌యాత్రగా చేరుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆయ‌నే భార‌త దేశ వ్యాపార దిగ్గ‌జం ముఖేష్ కుమార్ అంబానీ త‌న‌యుడు.. అనంత్ అంబానీ. ప్ర‌స్తుతం ఆయ‌న గుజ‌రాత్‌లోని జామ్ న‌గ‌ర్ నుంచి ప్ర‌ఖ్యాత కృష్ణ క్షేత్రం ద్వారకకు పాద‌యాత్ర చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల మ‌ధ్య దూరం 140 కిలో మీట‌ర్లు కావ‌డం గ‌మ‌నార్హం.

అనంత్ అంబానీ చేస్తున్న పాద‌యాత్ర‌కు.. ప్ర‌భుత్వం ప‌లు ప్ర‌ణాళిక‌లు చేసి.. ఆయ‌న‌కు సూచ‌నలు చేసింది. జ‌నాలు ర‌ద్దీగా ఉన్న స‌మ‌యంలో పాద‌యాత్ర చేయ‌డం లేదు. కేవ‌లం రాత్రి 11 గంట‌ల త‌ర్వాత‌.. నుంచి ఉద‌యం 6 వ‌ర‌కు మాత్ర‌మే ఆయ‌న పాద‌యాత్ర చేస్తున్నారు. దీనివ‌ల్ల అనంత్ అంబానీ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌తోపాటు.. ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో యూపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఆయా వేళ‌ల్లోనే అనంత్ అంబానీ త‌న పాద‌యాత్ర చేస్తున్నారు.

కార‌ణాలు ఏంటి?

అయితే అనంత్ అంబానీ ఎందుకు పాద‌యాత్ర చేస్తున్నార‌న్న విష‌యం మాత్రం ఇప్ప‌టికీ స్ప‌ష్టం కాలే దు. ఈ నెల‌ 10న అనంత అంబానీ పుట్టినరోజు ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆ రోజు నాటికి ద్వారకకు చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నార‌ని అంటున్నారు. ఇక‌, అనంత్ అంబానీ.. వ్యాపార సామ్రాజ్యం గురించి తెలిసిందే. ప్ర‌స్తుతం జియో స‌హా రిల‌యెన్స్‌కు చెందిన‌ ప‌లు కంపెనీల్లో డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వెంట వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బంది మాత్ర‌మే పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నారు.