ఇలాగైతే సన్‌రైజర్స్ మ్యాచ్ లు హైదరాబాద్ లో ఉండవట

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) – సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మధ్య తాజా వివాదం తీవ్రంగా మారేలా కనిపిస్తోంది. ఉచిత పాస్‌లను పెంచాలని హెచ్‌సీఏ చేస్తున్న ఒత్తిడి నేపథ్యంలో సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ బలమైన హెచ్చరికను జారీ చేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు తీరుతో సహనానికి అతీతంగా మారిన సన్‌రైజర్స్ యాజమాన్యం, పరిస్థితి ఇలానే కొనసాగితే నగరాన్ని వదిలి మరొక వేదికపై ఆడతామని వెల్లడించింది.

స్టేడియంపై అద్దె చెల్లిస్తున్న SRH యాజమాన్యం మూడేళ్లుగా కొనసాగుతున్న ఒప్పందంలో హెచ్‌సీఏకు 10 శాతం ఉచిత టికెట్లను ఇచ్చే విధానం అమలులో ఉంది. ఇందుకు అనుగుణంగా ప్రతి మ్యాచ్‌కు సుమారు 3900 టికెట్లు, 50 సీట్ల సామర్థ్యం ఉన్న కార్పొరేట్ బాక్స్‌ను అందజేస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో హెచ్‌సీఏ అదనంగా మరో 20 టికెట్లు కోరుతూ ఒత్తిడి తెస్తోందని, దాన్ని ఇవ్వకపోతే కార్పొరేట్ బాక్స్‌కు తాళం వేసే పరిస్థితి నెలకొందని సన్‌రైజర్స్ ఆరోపిస్తోంది.

ఇటీవల ఓ మ్యాచ్ సమయంలో ‘ఎఫ్-3’ బాక్స్‌ను ప్రారంభానికి గంట ముందు వరకు తాళం వేసి ఉంచిన ఘటనతో సన్‌రైజర్స్ యాజమాన్యం అసహనం వ్యక్తం చేసింది. స్టేడియంపై అద్దె చెల్లిస్తున్న తమకు అన్యాయంగా వ్యవహరిస్తుండటంపై సదరు బాక్స్ తెరవకపోవడం బ్లాక్‌మెయిలింగ్‌కు తక్కువ కాదని పేర్కొన్నారు. పైగా గత రెండేళ్లలో హెచ్‌సీఏ అధికారుల ప్రవర్తన మరీ దారుణంగా ఉందని, ఇప్పటికే హెచ్చరికలు ఇచ్చినప్పటికీ మార్పు లేదని లేఖలో వివరించారు.

ఈ వ్యవహారంపై హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలని, లేదంటే ఐపీఎల్‌లో తమ మ్యాచుల వేదికను మార్చేందుకు బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, యాజమాన్యంతో చర్చిస్తామని సన్‌రైజర్స్ స్పష్టం చేసింది. ఈ వివాదం కాస్త ఇలానే కొనసాగితే… హైదరాబాద్ జట్టు హోం మ్యాచులు ఇక హైదరాబాద్‌లోనే జరగకపోవచ్చన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి.