భూకంప విలయం… బ్యాంకాక్, మయన్మార్ లలో భారీ నష్టం

ఆసియాలో ప్రముఖ పర్యాటక దేశంగా పేరుగాంచిన థాయ్ ల్యాండ్ తో పాటు నిత్యం అంతర్యుద్ధంతో సతమతం అవుతున్న మయన్మార్ లను శుక్రవారం భూకంపం వణికించింది. వరుసగా రెండు భారీ భూకంపాలు చోటుచేసుకోగా.. ఈ రెండు దేశాల్లో భారీ నష్టమే చోటుచేసుకుంది. తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు కాగా…రెండో భూకంపం 6.4 తీవ్రతో చోటుచేసుకుంది. వరుసగా రెండు భూకంపాలు నిమిషాల వ్యవధిలో చోటుచేసుకోవడంతో నష్టం భారీగా జరిగింది. ఈ భూకంపాల కారణంగా ఈ రెండు దేశాల్లో చోటుచేసుకున్న నష్టం వివరాలకు చెందిన దృశ్యాలు యావత్తు ప్రపంచాన్ని హడలెత్తించాయి.

భూకంపం ధాటికి థాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ లో భారీ నష్టం సంభవించినట్లు సమాచారం. ఆకాశహార్మ్యాలను తలపించేలా ఉన్న బహుళఅంతస్థుల భవంతులన్నీ భూకంపం ధాటికి పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. చూస్తుండగానే ఆ భవనాల అలా కూలిపోతున్న దృశ్యాలు గగుర్పాటును కలిగించాయని చెప్పక తప్పదు. కూలిన భవనాలన్నీ వాణిజ్య భవనాలేనని కొందరు చెబుతుండగా… వాటిలో కొన్ని రెసిడెన్షియల్ భవనాలు కూడా ఉన్నాయని మరికొందరు చెబుతున్నారు. భవంతులన్నీ అలా పేకమడల్లా కూలిపోతూ ఉంటే… జనాలు పరుగులు పెడుతున్న దృశ్యాలు అక్కడి భయానక పరిస్థిని కళ్లకు కట్టింది.

అయితే ఈ భూకంపాలు జరిగిన తర్వాత పరిస్థితి సాదారణంగా మారిపోగా… అప్పటికే జరిగిన నష్టంతో మయన్మార్ లోని పలు ప్రాంతాలు, థాయ్ ల్యాండ్ రాజదాని బ్యాంకాక్ సహా ప్రధాన పట్టణాల్లో ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రోడ్డపైకి వచ్చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. జనమంతా ఒకేసారి రోడ్లపైకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి. నిత్యం పర్యాటకులతో కళకళలాడే బ్యాంకాక్… ఈ భూకంపాల నేపథ్యంలో ఖాళీ అయిపోతోంది. ఇదిలా ఉంటే… భూకంపం సంభవించిన వెంటనే అక్కడి ప్రభుత్వాలు సహాయక చర్యలను మొదలుపెట్టాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాలు మొదలయ్యాయి.