IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న వైభవ్‌ సూర్యవంశీ పేరు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు వేలంలో ఈ యువ ఆటగాడిని 1.1కోట్లకు దక్కించుకుని అతనికి అరుదైన అవకాశం ఇచ్చింది. ఇక ఇప్పుడు అతడి తొలి మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హై వోల్టేజ్ క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్‌ సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత అతడి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందనేది కూడా ఆసక్తిగా మారింది.

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఎదుర్కోనుంది. ఆదివారం (మార్చి 23) ఉప్పల్ స్టేడియంలో వేదికగా.. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనే వైభవ్‌ సూర్యవంశీకి ఆడే అవకాశం కలిసొచ్చేలా ఉంది. కచ్చితంగా అతను మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. కేవలం 12 ఏళ్ల 284 రోజుల వయసులో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఈ యువ ఆటగాడు, తన తొలి మ్యాచ్‌లోనే బరోడాపై 42 బంతుల్లో 71 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇక యూత్ టెస్టుల్లోనూ అతడు అత్యంత వేగంగా శతకం సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇటీవలి అండర్-19 ఆసియా కప్‌లోనూ రెండు హాఫ్ సెంచరీలు చేసి తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. బిహార్‌కు చెందిన వైభవ్‌ సూర్యవంశీపై ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు రాకేశ్ తివారీ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, “అతడు బలమైన ఆటతీరు కనబరుస్తాడనే నమ్మకం ఉంది. ఇతను తన ఆటతో ఐపీఎల్‌లో వెలుగొందే స్థాయికి ఎదగాలి” అంటూ అన్నారు.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 16 ఏళ్లకు మించని వయసు కలిగిన ప్లేయర్లు అరంగేట్రం చేయలేదు. కానీ వైభవ్ 13 ఏళ్లకే రాజస్థాన్‌ జట్టు ద్వారా బరిలోకి దిగుతున్నాడు. ఈ చిన్న వయసులోనే అంతటి ఘనత సాధించడం క్రికెట్‌ చరిత్రలో అరుదైన విషయమనే చెప్పాలి. ఇప్పటికే అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు వైభవ్‌ తన తొలి మ్యాచ్‌లో ఎలా రానిస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాల్యం నుంచి క్రికెట్ పట్ల ఆసక్తిని పెంచుకుని, అండర్-19 స్థాయిలో మెరిసిన అతడు ఇప్పుడు ఐపీఎల్‌ గ్రౌండ్‌లో కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తాడా? అన్నది ఉత్కంఠగా మారింది.