సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన ఆమె, తిరిగి భూమికి చేరిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫ్లోరిడాలో సముద్రజలాల్లో ల్యాండ్ అయిన స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’ క్యాప్సూల్ ద్వారా సునీతా భూమిని చేరుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయించనున్నారని ఆమె బంధువులు వెల్లడించారు.

సునీతా భూమిని సురక్షితంగా చేరుకోవడంతో గుజరాత్‌లోని ఆమె పూర్వీకుల గ్రామం ఝూలాసన్‌లో సంబరాలు మిన్నంటాయి. గ్రామస్థులు బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఆమె బంధువు ఫాల్గుణి పాండ్యా స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆమె కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నామని, చివరికి భూమికి తిరిగొచ్చిన వార్త తెలియగానే అందరికీ ఆనందం మిన్నంటిందని తెలిపారు. అంతేకాదు, సునీత త్వరలోనే భారత్‌కు వచ్చే అవకాశం ఉందని కూడా వెల్లడించారు.

ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సునీతా విలియమ్స్‌కు లేఖ రాసి, భారత్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. ఆమె అంతరిక్ష ప్రయాణం భారతీయులకు గర్వకారణమని, ఆమెను స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నామని మోదీ పేర్కొన్నారు. సునీతా కూడా భారత్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించిందని, ప్రత్యేకంగా తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆమె కుటుంబ సభ్యులతో సమయం గడిపిన తర్వాత భారత్‌లో పర్యటించనున్నారని సమాచారం.

సునీతా విలియమ్స్ అమెరికాలో జన్మించినప్పటికీ, ఆమె కుటుంబ మూలాలు గుజరాత్‌కు చెందినవి. ఆమె తండ్రి దీపక్‌ పాండ్యా భారతీయుడు. ఆమె భారతీయ మూలాల కారణంగా ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులతో స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. అంతరిక్ష ప్రయాణం నుంచి తిరిగి వచ్చిన అనంతరం, భారత పర్యటన కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలుస్తోంది. మరి ఆమె పర్యటన ఎప్పుడు జరుగుతుందనే ఆసక్తికర విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.