అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో పాటుగా ఐఎస్ఎస్ వెళ్లిన బుచ్ విల్మోర్ కూడా సేఫ్ గా తిరిగి వచ్చారు. దీంతో సునీత, విల్మోర్ లను అంతరిక్షంలోకి పంపిన అమెరికాతో పాటుగా ఇటు సునీత మూలాలు ఉన్న భారత్ లోనూ సంబరాలు మిన్నంటాయి. సాంకేతిక కారణాల రీత్యా దాదాపుగా 9 నెలల పాటు ఐఎస్ఎస్ లోనే ఉండిపోయిన సునీత తిరిగి రాక ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తున్నా… నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ సంయుక్తంగా జరిపిన ప్రయోగంతో ఎట్టకేలకు సునీత, విల్మోర్ లు మంగళవారం ఉదయం సురక్షితంగా భూమికి చేరారు.
సునీత, విల్మోర్ ల తిరిగి రాకపై నాసా మంళవారం ఉదయం విస్పష్ట ప్రకటన చేసింది. సునీత, విల్మోర్ లను తిరిగి తీసుకురావడానికి తమతో పాటు స్పేస్ ఎక్స్ జరిపిన ప్రయోగం విజయవంతంగా ముగిసిందని ఆ ప్రకటనలో నాసా తెలిపింది. అంతేకాకుండా స్పేస్ ఎక్స్ పంపిన వ్యోమ నౌక సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని ప్రకటించింది. దాదాపుగా 288 రోజుల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీత, విల్మోర్ లు భూమికి చేరారని… వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆ సంస్థ ప్రకటించింది. స్పేస్ ఎక్స్ పంపిన వ్యోమ నౌక భూమిపై ల్యాండ్ అయిన మరుక్షణమే… అటు స్పేస్ ఎక్స్ తో పాటుగా ఇటు నాసాలోనూ సంబరాలు మిన్నంటాయి.
సునీత, విల్మోర్ లను తిరిగి తీసుకువచ్చేందుకు స్పేస్ ఎక్స్ ప్రయోగించిన క్రూ డ్రాగన్… ఇటీవలే ఐఎస్ఎస్ కు చేరగా… అందులోనే వారిద్దరూ తిరిగి వచ్చారు. సునీత, విల్మోర్ లను క్రూ డ్రాగన్ లో వెళ్లిన మరో ఇద్దరు వ్యోమగాములు తిరిగి తీసుకువచ్చారు. ఈ వ్యోమ నౌక మంగళవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయ్యింది. అప్పటికే అక్కడ బోట్లతో సిద్ధంగా ఉన్న నాసా సిబ్బంది వ్యోమ నౌకను బోటుపైకి ఎక్కించుకుని ఓడ్డుకు చేర్చారు. అనంతరం వ్యోమ నౌకలో ఉన్న సునీత, విల్మోర్ లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములను బయటకు తీసుకువచ్చి హోస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.