టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను వచ్చే నెలలో ఆరంభయయ్యే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు దూరం పెట్టడం దుమారం రేపుతోంది. ముందు రోహిత్‌ను గాయం కారణంగానే ఈ పర్యటనకు ఎంపిక చేయలేదని అంతా అనుకున్నారు. తొడ కండరాల గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రోహిత్.. ఆస్ట్రేలియాతో టీ20లు, వన్డేలు, టెస్టులు.. ఈ మూడింటికీ దూరం పెట్టడంతో ఇక అతను ఐపీఎల్‌లో కూడా ఆడడనే అంతా అనుకున్నారు. గాయం తీవ్రత చాలా ఎక్కువ అని భావించారు.
కానీ ఒక రోజు తిరిగేసరికి సోషల్ మీడియాలో కనిపించిన రోహిత్ నెట్ ప్రాక్టీస్ వీడియో చూసి అంతా షాకయ్యారు. అది తాజాగా తీసిన వీడియోనే. ముంబయి ఇండియన్స్ జట్టు దాన్ని షేర్ చేసింది. అందులో రోహిత్ ఎంచక్కా ప్రాక్టీస్ చేస్తున్నాడు. చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. చాలా దూకుడుగా షాట్లు ఆడుతున్నాడు. అంటే అతను ఫిట్‌గా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఆస్ట్రేలియా పర్యటనకు ఇంకా 20 రోజులకు పైగా సమయం ఉంది. ఈలోపు ఐపీఎల్ మ్యాచ్‌లున్నాయి. రోహిత్ ముంబయి ఆడబోయే తర్వాతి మ్యాచ్‌లో బరిలోకి దిగబోతున్నాడు. అలాంటిది రెండు నెలల ఆస్ట్రేలియా పర్యటనకు పూర్తిగా అతణ్ని దూరం పెట్టడంలో ఆంతర్యమేంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఈ విషయమై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం గళం విప్పాడు. రోహిత్‌కు అసలేమైందో చెప్పాలని సెలక్టర్లను నిలదీశాడు. గాయం పేరు చెప్పి రోహిత్‌ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియా జనం ఈ విషయంలో కోహ్లీని టార్గెట్ చేశారు. కొంత కాలంగా కోహ్లీకి, రోహిత్‌కు పడట్లేదన్న ప్రచారం జరుగుతోంది. కెప్టెన్‌గా కోహ్లీ కంటే రోహిత్ బెటర్ అనేవాళ్లు చాలామందే ఉన్నారు. రోహిత్ సారథ్యంలో ఐపీఎల్‌లో ముంబయి నాలుగుసార్లు కప్పు గెలవడం ఇక్కడ ప్రస్తావనార్హం. అదే సమయంలో ఐపీఎల్‌లో కోహ్లీ నాయకత్వంలోనే బెంగళూరుది అంతంతమాత్రం ప్రదర్శనే. కాగా ఇప్పుడు రోహిత్ గాయం అంత తీవ్రమైంది కాకపోయినా.. అతణ్ని కావాలనే కోహ్లీ పక్కన పెట్టించాడని అతడి యాంటీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు తనను దూరం పెట్టాక రోహిత్ తన ట్విట్టర్ అకౌంట్లో ‘ఇండియన్ క్రికెటర్’ అనే మాటను తీసేయడంతో ఎక్కడో ఏదో తేడా ఉందనే సందేహాలు మరింత పెరుగుతున్నాయి.