“స్మగ్లింగ్ ఎలా చెయ్యాలో యూట్యూబ్ లో నేర్చుకున్నా”

కన్నడ నటి రణ్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. ఆమె దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న వెంటనే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆమె వద్ద అప్పుడు 14.2 కిలోల బంగారం దొరికింది. దీని విలువ 12.56 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఇంట్లో జరిగిన సోదాల్లో మరో 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 2.67 కోట్ల నగదు బయటపడింది.

ఈ కేసులో విచారణ సమయంలో రణ్యా షాకింగ్ సమాచారం వెల్లడించింది. తనకు ఇంతకుముందు ఎలాంటి అనుభవం లేదని, బంగారం దాచే విధానాలు యూట్యూబ్ చూస్తూ నేర్చుకున్నానని చెప్పింది. ఈ కేసులో రణ్యా రావు మూడు రోజుల పాటు DRI కస్టడీలో ఉండగా, విచారణలో పూర్తిగా సహకరించలేదని అధికారులు తెలిపారు. ఆమె బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు వచ్చే శుక్రవారం వరకు రిజర్వ్ చేసింది.

ఈ కేసులో రణ్యా విమానాశ్రయంలో ఉన్న భద్రతా నియమాలను దాటివెళ్లేందుకు అధికారిక ప్రోటోకాల్‌ను తప్పుగా వినియోగించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో తెలిపారు. ప్రోటోకాల్ ఆఫీసర్, పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆమెకు ప్రత్యేక భద్రతా అనుమతులు ఇచ్చినట్లు విచారణలో వెల్లడించారు.

రణ్యా రావు కేసులో రాజకీయ సంబంధాలపై కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో కొంత మంది మంత్రుల ప్రమేయం ఉందంటూ ప్రచారం సాగుతోంది. కానీ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ వార్తలను ఖండించారు. ఇది పూర్తిగా బీజేపీ పథకం అని, ప్రభుత్వంలో ఎవ్వరూ అక్రమ కార్యకలాపాలకు సహకరించలేరని స్పష్టం చేశారు. అయితే సీఎం సిద్ధరామయ్య ఈ కేసు గురించి ఆంతర్య దర్యాప్తుకు ఆదేశించారు.

రణ్యా రావు తండ్రి రామ్‌చంద్ర రావు, కర్ణాటక పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డీజీపీ కావడంతో, ప్రోటోకాల్ అధికారిపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు మరింత ఊహించని కోణాలను తెరపైకి తీసుకువస్తోంది. ముఖ్యంగా విమానాశ్రయ భద్రతా ఏర్పాట్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

డీకే శివకుమార్ ఈ విషయంపై స్పందిస్తూ, “నేను దుబాయ్ నుంచి వచ్చినప్పుడు చిన్న చిన్న వస్తువులు కూడా తొలగించమన్నారు. అలాంటిది 14 కిలోల బంగారం ఎలా బయటపడకుండా వచ్చింది?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేసును CBI, DRI సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. అసలు రణ్యా రావు ఒంటరిగా ఈ స్మగ్లింగ్ చేసిందా లేదా బలమైన నెట్‌వర్క్ ఆమె వెనుక ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక ఈ కేసులో అసలు సమాధానాలు ఏమిటన్నది త్వరలోనే తేలనున్నట్టు తెలుస్తోంది.