లలిత్ మోడీ: భారత పౌరసత్వానికి గుడ్ బై.. మరి కేసుల సంగతేంటి?

భారత క్రికెట్‌ను బిజినెస్ మోడల్‌గా మార్చిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. లండన్‌లోని భారత హైకమిషన్‌కు తన భారతీయ పాస్‌పోర్ట్‌ను స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లు ఆయన అధికారికంగా దరఖాస్తు చేసుకున్నాడు. దీని ప్రకారం, ఆయన ఇకపై భారత పౌరుడిగా లెక్కించబడడు. అదే సమయంలో, లలిత్ మోడీ వనౌటు దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ధృవీకరించింది. దీంతో ఈ పరిణామం చట్టపరమైన ప్రశ్నలు, రాజకీయ చర్చలకు దారి తీసింది.

వనౌటు (Vanuatu) ఒక చిన్న ద్వీప దేశం, ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు సమీపంగా ఉండే ఈ దేశం ప్రధానంగా 80కు పైగా చిన్న చిన్న ద్వీపాలతో కూడి ఉంది. దాదాపు 1,30,000 డాలర్ల పెట్టుబడి ద్వారా ఈ దేశ పౌరసత్వాన్ని పొందవచ్చు. కొన్ని దేశాల్లో చట్టపరమైన కేసుల నుంచి తప్పించుకునేందుకు కొందరు ఈ దేశ పౌరసత్వాన్ని తీసుకుంటారు. లలిత్ మోడీ కూడా అదే ట్రాక్ లో వెళ్ళాడు.

2010లో భారతదేశం విడిచి వెళ్లిన లలిత్ మోడీ అప్పటి నుంచి లండన్‌లో నివసిస్తున్నాడు. ఐపీఎల్‌లో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో భారత ప్రభుత్వ సంస్థలు, ముఖ్యంగా ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), అతనిపై కేసులు నమోదు చేశాయి. ఇక విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ వివరణ ప్రకారం, “లలిత్ మోడీ పాస్‌పోర్ట్‌ను వదులుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇది ప్రస్తుతం ఉన్న చట్టాలు, విధానాల ప్రకారం పరిశీలించబడుతుంది. కానీ అతనిపై కేసులను కొనసాగిస్తాం” అని క్లారిటీ ఇచ్చారు.

అంటే, పౌరసత్వం మారినా, భారత ప్రభుత్వం అతనిపై నేర విచారణను వదిలిపెట్టదని స్పష్టం. గతంలో కూడా అనేక డిఫాల్టర్లు విదేశాలకు పారిపోయిన సందర్భాల్లో ఎక్స్‌ట్రడిషన్ ప్రక్రియలు భారత్‌లో నెమ్మదిగా కొనసాగిన ఘటనలు ఉన్నాయి. లలిత్ మోడీ మాదిరిగానే కొన్ని ప్రముఖ వ్యాపారవేత్తలు, మోసగాళ్లు విదేశాలకు పారిపోయి పౌరసత్వ మార్పులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ లాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు భారత ప్రభుత్వం చాలా సమయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు లలిత్ మోడీ అంశం కూడా అదే కోవకు చెందుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వనౌటు పౌరసత్వం తీసుకోవడం, భారత పాస్‌పోర్ట్‌ను వదులుకోవడం ద్వారా లలిత్ మోడీ ఏదైనా లీగల్ లూప్‌హోల్ ఉపయోగించుకుంటున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం లలిత్ మోడీ వ్యక్తిగత నిర్ణయంగా మాత్రమే కాకుండా, భారత న్యాయవ్యవస్థకు, ప్రభుత్వ అధికారాలకు పరీక్షగా మారింది. అతనిపై ఉన్న కేసులను తీర్చిదిద్దేందుకు భారత ప్రభుత్వం ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాలి.