భారత ఫుట్‌బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రి మళ్లీ జాతీయ జట్టులోకి రావడం అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది. గత ఏడాది అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన ఛెత్రి, ఇప్పుడు దేశానికి అవసరం వచ్చిన తరుణంలో తిరిగి జట్టులో చేరాడు. ఈ నెలలో జరగనున్న ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచుల కోసం భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) అతన్ని జట్టులో చేర్చింది. 40 ఏళ్ల వయసులోనూ తన ఆటతో రాణిస్తున్న ఛెత్రి, జట్టుకు తిరిగి రావడం భారత ఫుట్‌బాల్‌కు ఎంతో ప్రోత్సాహకరంగా మారింది. 2005లో జాతీయ జట్టులో అరంగేట్రం చేసిన ఛెత్రి, భారత్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు. గతంలోనే అతను ఫుట్‌బాల్ నుంచి తప్పుకోవడంతో భారత జట్టు పెద్ద గ్యాప్‌ను ఎదుర్కొంది.
తన కెరీర్‌ను అత్యున్నత స్థాయిలో కొనసాగించిన ఛెత్రి, 94 అంతర్జాతీయ గోల్స్‌తో ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. క్రిస్టియానో రొనాల్డో, లయోనల్ మెస్సీ, అలీ దాయి తర్వాత ఛెత్రి పేరు ఉండటం గర్వకారణంగా మారింది. 2022లో ఫిఫా అతనిపై ‘క్యాప్టెన్ ఫాంటాస్టిక్’ అనే డాక్యుమెంటరీని విడుదల చేసింది. గత ఏడాది జూన్ 6న కువైట్‌పై ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ అనంతరం అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇప్పుడు భారత కోచ్ మానోలో మార్క్వెజ్ ఛెత్రిని తిరిగి జట్టులోకి తీసుకురావడానికి ఒప్పించినట్టు పేర్కొన్నాడు. “ఎసియన్ కప్ క్వాలిఫై చేయడం మాకు ఎంతో కీలకం. జట్టు బలోపేతానికి ఛెత్రి అవసరం అని భావించి అతనితో చర్చించాను. అతను అంగీకరించడంతో తిరిగి జట్టులో చేర్చాం” అని మార్క్వెజ్ తెలిపారు.
ఈ ఏడాది మార్చి 19న భారత జట్టు మాల్దీవులతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అనంతరం మార్చి 25న బంగ్లాదేశ్‌తో జరిగే ఎఎఫ్‌సీ ఆసియన్ కప్ 2027 క్వాలిఫైయర్స్ ఫైనల్ రౌండ్ మ్యాచ్ కోసం టీమ్ సిద్ధమవుతోంది. ఈ రెండు మ్యాచులు షిల్లాంగ్‌లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్నాయి. ఆసియన్ కప్ క్వాలిఫైయింగ్‌లో భారత్ బంగ్లాదేశ్, హాంకాంగ్, సింగపూర్‌తో ఒకే గ్రూప్‌లో ఉంది. గత సారి భారత జట్టు గ్రూప్ దశను దాటలేక పోయింది. ఇప్పుడు ఛెత్రి తిరిగి రావడం జట్టుకు కొత్త ఉత్సాహం నింపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే, రిటైర్మెంట్ తర్వాత కూడా ఛెత్రి బెంగళూరు ఎఫ్‌సీ తరఫున ఇండియన్ సూపర్ లీగ్‌లో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 23 మ్యాచ్‌లలో 12 గోల్స్ కొట్టి బెంగళూరు జట్టుకు అత్యధిక గోల్స్ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. సుదీర్ఘ అనుభవం, స్ట్రైకింగ్ నైపుణ్యాలతో జట్టును ముందుకు నడిపే ఛెత్రి, భారత్ తరఫున మరోసారి మేజర్ టోర్నమెంట్‌లో బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.