రోహిత్ శర్మ బరువుపై కామెంట్స్… తీవ్ర దుమారం

అసలే దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతోంది. కేంద్రంలో అధికారానికి దూరమై పదేళ్లు దాటింది. రాష్ట్రాల్లో ఒకటీ అరా తప్ప అన్నింట్లోనూ పట్టు కోల్పోయింది. ఇలాంటి స్థితిలో ప్రజల మనోభావాలకు తగ్గట్లు రాజకీయం చేసి వారి మన్నన పొందాల్సింది పోయి.. ఇంకా ఇంకా వ్యతిరేకత పెంచుకునేలా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ నేతలు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, అధికార ప్రతినిధి షామా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు తాజా ఉదాహర. రోహిత్‌ శర్మ మీద ఆమె బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం తీవ్ర దుమారం రేపింది.

షామా తాజాగా రోహిత్ శర్మను టార్గెట్ చేస్తూ ఒక సోషల్ మీడియా పోస్టు పెట్టారు. ‘‘రోహిత్ శర్మ ఓ క్రీడాకారుడిలా కాకుండా.. లావుగా ఉంటాడు. అతడు కచ్చితంగా బరువు తగ్గాలి. అసలేమాత్రం ఆకట్టుకునేలా ఉండని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే’’ అని ఆమె ఈ పోస్టులో పేర్కొన్నారు. రోహిత్ శర్మను ఉన్నట్లుండి షామా ఎందుకు టార్గెట్ చేసింది, దీని వెనుక ఏమైనా వేరే నేపథ్యం ఉందా అన్నది తెలియదు. కానీ ఆమె వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర దుమారమే రేపాయి. రోహిత్ ఫ్యాన్సే కాక సగటు క్రికెట్ అభిమానులందరూ ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.

అధికార బీజేపీకి ఈ కామెంట్స్ ఆయుధంలా మారాయి. కాంగ్రెస్ పార్టీని గట్టిగా టార్గెట్ చేశారు బీజీపీ వాళ్లు. ఐతే ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, ఆ పోస్టును డెలీట్ చేయాలని షామాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ షామా మాత్రం ఇంత వ్యతిరేకత తర్వాత కూడా తగ్గలేదు. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తన పోస్టును డెలీట్ చేసినప్పటికీ రోహిత్ మీద విమర్శలు ఆపలేదు.

గత భారత కెప్టెన్లతో పోలిస్తే రోహిత్‌కు అంతటి ప్రపంచస్థాయి ఏముందని.. అతడో సాధారణ స్థాయి కెప్టెన్ అని.. క్రీడాకారుడిగా కూడా అతడిది సాధారణ స్థాయేనని.. అదృష్టం కొద్దీ అతడికి టీమ్ ఇండియా కెప్టెన్సీ లభించిందని ఆమె వ్యాఖ్యానించింది. తాను నేను ఎవరినీ బాడీ షేమింగ్ చేయలేదని.. క్రీడాకారులు ఫిట్‌గా ఉండాలని మాత్రమే అన్నానని.. అతడు బరువు ఎక్కువగా ఉన్నాడని అనిపించిందని.. అదే విషయాన్ని చెప్పానని ఆమె సమర్థించుకున్నారు.