2025 ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై టీమిండియా విజయంతో గ్రూప్-ఎ టాపర్‌గా సెమీఫైనల్‌కు అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అదరగొట్టగా, అక్షర్ పటేల్ కీలకమైన కేన్ విలియమ్సన్ వికెట్ తీసి జట్టు విజయానికి మార్గం సుగమం చేశాడు. అయితే, అక్షర్ వికెట్ తీసిన క్షణంలో కోహ్లి స్పందన ఆసక్తికరంగా మారింది. తన సహచరుడి కాళ్లు పట్టుకోవడానికి కోహ్లి ప్రయత్నించగా, అక్షర్ వెంటనే అతడిని అడ్డుకున్నాడు. ఈ సరదా ఘటనను కెమెరాలు క్యాచ్ చేయగా, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేన్ విలియమ్సన్ 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిలిచినప్పుడు, న్యూజిలాండ్ విజయానికి 55 బంతుల్లో 81 పరుగులు కావాల్సిన దశలో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే 41వ ఓవర్ చివరి బంతికి అక్షర్ వేసిన డెలివరీని షాట్ ఆడేందుకు కేన్ ముందుకు వచ్చాడు. కానీ బాల్ మిస్సయ్యింది. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చాకచక్యంగా స్టంప్ అవుట్ చేయడంతో న్యూజిలాండ్ ఆశలు ముగిశాయి. ఈ కీలక వికెట్‌కు గౌరవంగా కోహ్లి నవ్వుతూనే అక్షర్ దగ్గరకు వెళ్లి అతడి పాదాలను తాకేందుకు ప్రయత్నించాడు. కానీ అక్షర్ అతడిని వెంటనే నిలిపివేశాడు.
నిజంగా సరదాకైనా కోహ్లీ కాళ్లు పట్టుకునే వరకు వెళ్ళాడు అంటే కేన్ మామ కాస్త భయపెట్టేశాడు అని కొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఇక విరాట్ సరదాగా తన కాళ్లు పట్టుకోవాలని ట్రై చేయడంతో అక్షర్ ఒక్కసారిగా నవ్విపోవడంతో పాటు కోహ్లిని ఆపాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ అనంతరం సహచర ఆటగాళ్లు అక్షర్‌ను అభినందించగా, కోహ్లి, అక్షర్ కలిసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
ఇదిలా ఉంటే, భారత్ సెమీఫైనల్లో మంగళవారం ఆస్ట్రేలియాతో తలపడనుంది. గత వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునే వీలుగా ఈ మ్యాచ్‌ను టీమిండియా చూస్తోంది. మరోవైపు, రెండో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ తలపడనుండగా, ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates