ఫార్ములా 8-8-8.. ఫాలో కావాలంటున్న పారిశ్రామిక దిగ్గజం

ఇటీవల కాలంలో పని గంటల మీద ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే ఇన్ఫో నారాయణమూర్తి రోజుకు 12-14 గంటలు పని చేయాలని చెప్పటం.. మరో పెద్ద మనిషి ఇంట్లో ఎంతసేపు భార్యను చూస్తూ ఉంటారు?ఆఫీసుకు వచ్చి పని చేయమని మందలించాడో.. అప్పటి నుంచి మనిషి అనేటోడు ఎన్ని గంటలు పని చేయాలి? ఎంత ఉద్యోగం చేస్తే మాత్రం.. యజమానికి బానిసలా పని చేస్తూనే ఉండాలా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

పని మాత్రమే చేసుకుంటూ పోతే ఇక జీవితం ఎందుకు? జీవితంలో సాధించేదేంటి? అసలు పని చేయటానికేనా పుట్టింది? లాంటి ప్రశ్నలు తెర మీదకు వచ్చిన పరిస్థితి. ఇలాంటి వేళ.. లైఫ్ ను బ్యాలెన్స్ చేసుుకోవటం.. పనిని సమన్వయం చేసుకోవటం లాంటి అంశాలపై కొందరు ప్రముఖులు అందరికి ఆమోదయోగ్యమైన ఫార్ములాను తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఫార్ములా ఒకటి తెర మీదకు వచ్చింది.

8-8-8 ఉండే ఈ ఫార్ములాను రూపొందించింది మరెవరోకాదు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా సతీమణి నీర్జా బిర్లా. పని గంటల మీద ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. రోజులో 24 గంటల్ని 8-8-8 చొప్పున విభజించుకోవాలని చెబుతున్నారు. పనికి 8 గంటలు.. నిద్రకు 8 గంటలు.. విశ్రాంతికి 8 గంటలు కేటాయించుకోవాలని చెబుతున్నారు.

ఇలా మొత్తం 24 గంటల్ని డివైడ్ చేసుకుంటూ బాగుంటుందని.. జీవితం సాఫీగా సాగుతుందని చెబుతున్నారు. మొత్తం 24 గంటల్ని పనికి మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్సు చేసుుకోవటంపై ఫోకస్ చేయాలని చెబుతున్నారు. ఈ నియమం కాస్త కష్టంగా ఉన్నప్పటికి సమతుల్యం చేసుకోవటానికి ప్రయత్నించాలని చెబుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. మేడమ్ చెప్పిన ఫార్ములా ఓకే. కానీ.. తమ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల పని గంటలు ఎలా ఉన్నాయన్నది చెక్ చేసే ఈ ఫార్ములాను చెబుతున్నారా? లేదంటే.. లేనిపోని సమస్యలు ఆమెకు ఎదురుకాక మానదు.