ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన సమాగమంగా పేరుగాంచిన మహాకుంభమేళా తాజాగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు జరిగిన ఈ మేళా మహాశివరాత్రితో పరిసమాప్తమైంది. ఈసారి భక్తుల రద్దీ గత రికార్డులను అధిగమించి, 66 కోట్ల మంది భక్తులు గంగ, యమున, సరస్వతి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అక్షరాల అమెరికా జనాభాకు రెట్టింపు స్థాయిలో భక్తులు తరలిరావడం విశేషంగా నిలిచింది. ఆధ్యాత్మికత, భక్తి, సంస్కృతీ సమ్మేళనంగా కొనసాగిన ఈ మహాకుంభమేళా మరికొన్ని దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మహాకుంభమేళా ముగిసిన వెంటనే భక్తుల మనసులో వచ్చే ప్రశ్న – తదుపరి కుంభమేళా ఎప్పుడు, ఎక్కడ?.. అయితే వచ్చే కుంభమేళా 2027లో మహారాష్ట్రలోని నాసిక్‌లో జరుగనుంది. ఇది జులై 17 నుంచి ఆగస్టు 17 వరకు జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు. నాసిక్‌కు 38 కిలోమీటర్ల దూరంలోని త్రయంబకేశ్వరంలో గోదావరి నదీ తీరంలో ఈ మేళా జరగనుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర శివాలయం ఇక్కడే ఉండడం వల్ల ఈ మేళాకు మరింత ప్రాముఖ్యత ఉంది. ఈసారి అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మరింత విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కుంభమేళా పద్ధతి గురించి తెలిసిన వారు ఈ మేళా మళ్ళీ మూడేళ్లకే మరోసారి ఎందుకు వస్తోందో అని ప్రశ్నించవచ్చు. అయితే ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో ప్రతి మూడేళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అయితే, 12 ఏళ్లకు ఒకసారి జరిగేదే పూర్తి కుంభమేళాగా పరిగణిస్తారు. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మేళానే మహాకుంభమేళాగా పిలుస్తారు. ఈసారి ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ముగిసిన నేపథ్యంలో, 2027 నాటికి నాసిక్‌లో జరిగే మేళా సాధారణ కుంభమేళాగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులే కాకుండా, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈసారి మహాకుంభమేళాకు హాజరయ్యారు.
అంతర్జాతీయంగా కూడా ఈ మహాసభ ప్రాధాన్యతను పెంచుతూ, 77 దేశాలకు చెందిన 118 మంది దౌత్యవేత్తలు ఈ మహా మేళాలో భాగమయ్యారు. మొత్తంగా, 2025 మహాకుంభమేళా భక్తులకు స్మరణీయంగా నిలిచిపోయింది. అయితే, ఈ పవిత్ర మహోత్సవాన్ని మళ్లీ అనుభవించాలనుకునే భక్తులు 2027 నాటికి నాసిక్‌లో జరిగే కుంభమేళాకి సిద్ధమవ్వవచ్చు.