ఉత్తరాఖండ్ లో హిమపాతం భారీ ఉత్పాతాన్ని సృష్టించింది. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా పరిధిలోని మన పాస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారుల్లో ఒకటిగా రికార్డుకెక్కింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిర్వహణలో ఉన్న ఈ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఓ పెను ప్రమాదం సంభవించింది. రహదారి మరమ్మతు పనుల్లో దాదాపుగా 57 మంది కూలీలు నిమగ్నమై ఉండగా.. హిమపాతం విరుచుకుపడింది. ఆ మంచు దెబ్బకు కార్మికులంతా చెల్లాచెదురు అయ్యారు. కార్మికులంతా మంచు కిందే కప్పబడిపోయారు.
ఈ ప్రమాదం గురించి తెలిసినంతనే, ఇండియన్ ఆర్మీ, ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) హుటాహుటీన సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మంచు కింద కప్పబడిపోయిన ఓ 10 మంది కార్మికులను ఐటీబీపీ సిబ్బంది కాపాడారు. గాయాల పాలైన వీరిని హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మిగిలిన 47 మంది జాడ తెలియరాలేదు.
అసలే దేశ సరిహద్దు ప్రాంతం… ఆపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రహదారి కావడంతో సహాయక చర్యలకు అంతగా అవకాశం లేకుండాపోయింది. ఈ ప్రమాదం గురించిన సమాచారం తెలిసినంతనే చమోలి జిల్లా కలెక్టర్… సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. రహదారిపై పడిపోయిన మంచును తొలగించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అప్పుడే కార్మికుల జాడ తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates