ఇటీవలి కాలంలో అమెరికాలో ఎయిర్ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా గత నెల రోజుల క్రితం మూడు విమాన ప్రమాదాలు అమెరికాను షాక్ కు గురి చేసింది. ఈమధ్య కాలంలో ఎప్పుడూ చూడనంత ప్రాణనష్టం కూడా జరిగింది. అయితే రీసెంట్ గా అమెరికాలోని చికాగో మిడ్వే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది.
ఒక ప్రయాణికుల విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ జెట్ అదే రన్‌వేపైకి ప్రవేశించింది. చివరి క్షణంలో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి ల్యాండింగ్‌ను రద్దు చేయడంతో, పెనుప్రమాదం తప్పింది. స్వౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 2504 విమానం ల్యాండింగ్‌కు సిద్ధమవుతుండగా, తెల్లని ప్రైవేట్ జెట్ రన్‌వేపై కనిపించింది. వెంటనే పైలట్ ల్యాండింగ్‌ను రద్దు చేసి, విమానాన్ని మళ్లీ పైకెత్తి వేగంగా ఎగరబెట్టాడు.
విమానం కేవలం 50 అడుగుల దూరంలోనే నేలను తాకే ప్రమాదంలో ఉండగా, ఈ శరవేగ నిర్ణయం తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనలో ప్రైవేట్ జెట్ పైలట్ వైఫల్యమే కారణంగా కనిపిస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పునరుద్ఘాటించినా, రన్‌వేపైకి ప్రవేశించొద్దని తొమ్మిది సార్లు హెచ్చరించినా, ప్రైవేట్ జెట్ పైలట్ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం గమనార్హం. ఇది మరింత ప్రమాదకరమైన పరిస్థితిని సృష్టించగా, స్వౌత్‌వెస్ట్ పైలట్ సమయస్ఫూర్తితో స్పందించడంతో భారీ ముప్పు తప్పింది.
ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) మరియు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) విచారణ మొదలుపెట్టాయి. ఇటీవలి కాలంలో అమెరికాలో ఎయిర్ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతుండటంతో, ఈ ఘటన విమాన ప్రయాణ భద్రతపై మరింత ఆందోళన కలిగిస్తోంది. ముందే తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, ఇలాంటి ఘోర ప్రమాదాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని విమానయాన నిపుణులు హెచ్చరిస్తున్నారు.