మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు విక్టరీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వరుసబెట్టి వైసీపీ అక్రమాలపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటిదాకా ఈ కేసులన్నీ దాదాపుగా టీడీపీ తరఫు నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగానే నమోదు అయ్యాయని చెప్పాలి. ఇప్పుడు కూటమిలోని మరో భాగస్వామి జనసేన నుంచి కూడా వైసీపీకి ఈ తరహా ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి కృష్ణా- గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా జరిగిన జనసేన సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా మంగళవారం మనోహర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో జనసేన శ్రేణులు… ప్రత్యేకించి వీర మహిళలపై వైసీపీ శ్రేణులు చేసిన అసభ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పార్టీ కోసం వీర మహిళలు పోరాటం చేస్తూ ఉంటే… వీర మహిళలపై వైసీపీ నేతలు చవకబారు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా జనసేన శ్రేణులపై వైసీపీ శ్రేణులు దాడులకూ పాల్పడ్డాయన్నారు. ఈ దాడులను ఎదుర్కొంటూనే జనసేన శ్రేణులు ముందుకు సాగిన వైనాన్ని మనోహర్ కొనియాడారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ లేదని ఆయన చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా వైసీపీ శ్రేణులు వ్యవహరించాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనకు చెందిన ఎంతో మందిని వైసీపీ నేతలు ఇబ్బందులు పెట్టారన్నారు. కేసులు పెట్టడంతో పాటుగా చాలా మందిని జైలుకు పంపారన్నారు.
గడచిన ఐదేళ్ల పాలనలో వైసీపీ చేసిన ఈ దుర్మార్గాలను జనసేనకు చెందిన ఏ ఒక్కరు కూడా మరచిపోరాదని మనోహన్ అన్నారు. అధికారంలోకి వచ్చిన మనం… కక్షసాధింపు దిశగా కాకుండా గతంలో ఎవరైతే పొరపాట్లు చేశారో.. ఎవరైతే కావాలని మనల్ని ఇబ్బంది పెట్టారో… ఎవరైతే దౌర్జన్యంగా వ్యవహరించారో… వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని ఆయన అన్నారు. దానికి కొంత సమయం పట్టినా సరే… అందరం కలసికట్టుగా ఉండి దుర్మార్గులకు స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. శాసనమండలిలో గతంలో జరిగిన దురాగతాలను కూడా మననం చేసుకుని… అలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే.. సభలో కూటమి సంఖ్యాబలాన్ని పెంచుకోవాల్సి ఉందన్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలను కూటమి పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని మనోహర్ పిలుపునిచ్చారు. వెరసి టీడీపీ ఫిర్యాదులకు తోడు ఇప్పుడు జనసేన ఫిర్యాదులు కూడా తోడు కానున్నాయని.. ఫలితంగా వైసీపీకి ఇక బ్యాండుబాజానేనని మనోహర్ స్పష్టమైన సంకేతాలిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates