సామాజిక మాధ్యమాల్లో అత్యంత బలమైన.. క్షణాల్లోనే ఆకర్షించగల సత్తా ఉన్న మాధ్యమం యూట్యూబ్. దీనికి చదువుతో పనిలేదు. కేవలం ఒక్క క్లిక్ తో వీక్షించే సదుపాయం.. వినే అవకాశం రెండు ఉన్నాయి.
దీంతో పండితుల నుంచి పామరుల వరకు ఇతర సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా వంటి వాటికంటే.. అత్యంత ప్రజాదరణ పొందుతున్న మాధ్యమంగా యూట్యూబ్ రికార్డు సృష్టించింది. అంతేకాదు.. ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆదాయం సంపాయించుకునే అవకాశం లేదు.
యూట్యూబ్ విషయానికి వస్తే.. సొంతగా ఛానెళ్లు క్రియేట్ చేసుకుని నెలనెలా వీవర్స్‌ను బట్టి లక్షల రూపాయలు ఆర్జించే వెసులు బాటు ఉంది. నిరుద్యోగ యువతకే కాదు.. ఇంట్లో ఉండే మహిళలకు కూడా.. ఇది ఎంతగానో దోహదపడుతున్న అంశం.
కుటీర పరిశ్రమగా నేడు వర్ధిల్లుతున్న యూట్యూబ్‌లో చిన్న చిన్న వీడియోల నుంచి నిడివి ఎక్కువగా ఉన్న వీడియోల వరకు.. ఆర్జనకు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే.. ఈ విషయంలో ఆర్జనే లక్ష్యంగా యూటబర్లు కొందరు.. చేస్తున్న వీడియోలు అత్యంత జుగుప్సాకరంగా ఉంటున్నాయనేది పబ్లిక్ టాక్!
అత్యంత నీచమైన వీడియోలు కూడా యూట్యూబ్‌లో వెలుగు చూస్తున్నాయి. దీనిలో యువతుల పాత్రను పక్కన పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. తొలినాళ్లలో విద్యార్థులకు, యువతకు ఉపయోగపడేలా.. అనేక వీడియోలు యూట్యూబ్ లో వచ్చేవి.
తర్వాత.. తర్వాత.. వీవర్స్, లైకుల ఆధారంగా ఆదాయ మార్గం గా యూట్యూబ్ ఏర్పడడంతో అనతి కాలంలో ఇది గాడి తప్పింది. ద్వంద్వార్థ పదాలు.. వీడియోలు.. జుగుప్సాకర కంటెంట్‌తో ఇప్పుడు యూట్యూబ్ రీల్స్ నుంచి వీడియోల వరకు.. పెను ప్రమాదంగా మారిపోయింది.
యూట్యూబ్‌లో చూసి రేప్‌లు చేయడం, హత్యలు చేయడం.. వంటివి కామన్‌గా మారిపోయాయి. అంతేకాదు.. ఇటీవల విజయవాడలో వెలుగు చూసిన ఓ ఘటన అయితే.. మరింత ఆశ్చర్యంగా మారింది. కాలేజీకి వెళ్లిన యువతి.. చేసిన పాడు పని.. యూట్యూబ్ నుంచే నేర్చుకున్నట్టు చెప్పడం పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇంటిల్లిపాదీ కూర్చుని చూసేందుకు సినిమాలు ఎలా అయితే..లేవో.. ఇప్పుడు యూట్యూబ్ పరిస్థితి కూడా అలానే మారిపోయిందని అంటున్నారు. ఇదంతా కేవలం ఆర్జన కోసం తొక్కుతున్న అడ్డదారులుగానే పరిశీలకులు చెబుతున్నారు.
అశ్లీల నృత్యాలు.. అశ్లీల డైలాగులు.. మహిళలు దుస్తులు మార్చుకోవడం.. వంటివి కూడా.. యూట్యూబ్ లో నిత్యకృత్యంగా మారాయి. అందరూ కాకపోయినా.. కొందరు చేస్తున్న ఈ ప్రయత్నాలు.. సమాజానికి చేటు చేస్తాయని అంటున్నారు.
కేంద్రానికి సెన్సార్ హక్కులు ఉన్నా.. ఫిర్యాదు చేస్తే తప్ప స్పందించని లక్ష్మణ రేఖ అశ్లీల యూట్యూబర్లకు వరంగా మారింది. దీంతో యూట్యూబ్ గాడితప్పుతోందని అంటున్నా రు పరిశీలకులు.