ట్రంప్ ముంగిట అక్రమ వలసలపై మోడీ కీలక వ్యాఖ్యలు

అక్రమ వలసలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలిసిన సందర్భంలో వారిద్దరు పలు అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం ఉభయులు కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్రమ వలసలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు.

ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదన్న ఆయన.. ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందన్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 104 మంది భారతీయుల్ని ఇటీవల చేతులకు.. కాళ్లకు గొలుసులు వేసి మరీ విమానాల్లో తరలించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. తిరిగి పంపే అక్రమ వలసల విషయంలో ఇంతటి అమర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వెల్లువెత్తిన విమర్శలపై ప్రదానమంత్రి నరేంద్ర మోడీ స్పందించలేదు.

ఈ సందర్బంగా అక్రమ వలసల్ని దేశానికి తిరిగి తీసుకొచ్చే అంశంలో వారిని మనమే ఎందుకు తీసుకురాకూడదన్న చర్చను కొందరు తెర మీదకు తీసుకొచ్చారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. బాధితులుగా ఉన్న వారిని మర్యాదపూర్వకంగా దేశానికి వచ్చేలా చేయాలన్న వాదన పలువురి నోట వినిపించింది. అయినప్పటికీ ప్రధాని మోడీ దీని గురించి మాట్లాడలేదు. కేంద్ర విదేశాంగ మంత్రి మాట్లాడినా.. ఆయన వ్యాఖ్యలు ఏవీ సంత్రప్తికరంగా లేవన్న మాట వినిపించింది.

ఇదిలాఉంటే.. ట్రంప్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంలో అక్రమ వలసలపై మోడీ సానుకూలంగా స్పందించటం గమనార్హం. రానున్న రోజుల్లో మరో రెండు విమానాల్లో అక్రమ వలసల్ని మన దేశానికి పంపేందుకు అమెరికా సిద్ధమవుతోంది. యువత.. పేదరికంలో ఉన్న వారుమోసపూరితంగా వలసదారులుగా మారుతున్నారన్న మోడీ.. డబ్బు.. ఉద్యోగాల ఆశజూపి కొంతమంది వీరిని మోసం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అలాంటి వారంతా అక్రమ వలసదారులుగా మారుతున్నారని.. వారికి తెలీకుండానే అక్రమరవాణా కూపంలోకి వెళుతన్నట్లుగా పేర్కొన్నారు. ఈ దారుణాల్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్న మోడీ.. “ఈ ప్రయత్నాల్లో భారత్ కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.