భారత క్రికెటర్ రిషభ్ పంత్ ప్రాణాలు కాపాడి వార్తల్లో నిలిచిన రజత్ కుమార్ జీవితంలో ఇప్పుడు విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లాలోని బుచ్చా బస్తీలో ఫిబ్రవరి 9న రజత్ తన ప్రియురాలు మను కశ్యప్‌తో కలిసి విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. తమ ప్రేమకు కుటుంబ సభ్యుల నుంచి అనుమతిని పొందలేక మనస్తాపానికి గురైన ఈ జంట ఆత్మహత్యను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఈ దారుణ ఘటనలో మను కశ్యప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, రజత్ కుమార్ పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. రజత్ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న స్థానికులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ప్రేమకథ ఇంత విషాదాంతం అవుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. 2022లో రిషభ్ పంత్ కారు ప్రమాదం తరువాత రజత్ కుమార్ పేరు వార్తల్లో నిలిచింది.
రూర్కీ సమీపంలో జరిగిన ఆ ప్రమాదంలో పంత్ కారుకు మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రజత్ కుమార్, నిషు కుమార్ కలిసి వెంటనే పరుగెత్తి వెళ్లి పంత్‌ను వాహనంలో నుంచి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఆ కృతజ్ఞతగా రిషభ్ పంత్ వారిద్దరికి స్కూటర్లను బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు రజత్ కుమార్ ఇలా ఆత్మహత్యకు ప్రయత్నించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
కులాల తేడా కారణంగా వారి కుటుంబాలు వివాహాన్ని అంగీకరించకపోవడం ఈ ఘోర పరిణామానికి కారణమైందని అంటున్నారు. కుటుంబాల నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక ఈ ప్రేమ జంట ఇలా ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. ఇక రజత్ ప్రాణాలతో బయటపడాలని అతని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఓ ప్రాణం కాపాడిన వ్యక్తి, ఇప్పుడు తన ప్రాణం కోసం పోరాడుతుండటం భాధాకరం అని సోషల్ మీడియాలో కామెంట్స్ వెలువడుతున్నాయి.