మెటా సంస్థ భారతదేశంలో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.16 ఏళ్ల లోపు ఉన్న పిల్లల కోసం సురక్షితమైన, వయస్సుకు తగిన అనుభవాన్ని అందించడానికి ఇన్‌స్టాగ్రామ్ టీన్ ఖాతాలను (Teen Accounts) రూపొందించినట్లు మెటా ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని పర్యవేక్షించగలరు. ఏ కంటెంట్‌ను చూడవచ్చో, ఎంత సమయం గడపవచ్చో నియంత్రించేందుకు ప్రత్యేకమైన స్టెప్స్ విధించనున్నారు.
ముఖ్యంగా, టీనేజ్ అకౌంట్లు ప్రైవేట్‌గా ఉండడం తప్పనిసరి, అలాగే అనుమతి లేకుండా ఖాతా సెట్టింగ్‌లను మార్చుకోవడం సాధ్యం కాదు. ఇన్‌స్టాగ్రామ్ టీనేజ్ ఖాతాల కోసం ప్రత్యేక రూల్స్‌ను రూపొందించింది. టీన్స్‌ను ఫాలో అవ్వాలంటే వారి అనుమతి అవసరం. అలానే, వారి ఫాలోవర్స్ మాత్రమే మెసేజ్ చేయగలుగుతారు. ఈ ఫీచర్ 18 ఏళ్ల లోపు వినియోగదారులకు వర్తిస్తుంది.
అదనంగా, హింసాత్మక దృశ్యాలు, భౌతిక గొడవలు, కాస్మెటిక్స్ వంటి ప్రమోషనల్ మెసేజ్‌లు పిల్లల ఖాతాల్లో కనబడకుండా ఫిల్టర్ చేయనున్నారు. వారి మెన్షన్, ట్యాగ్‌లు కూడా కేవలం ఫాలోవర్స్ మాత్రమే చూడగలరు. ప్రతి గంటకోసారి యాప్‌లో గడిపిన సమయం గురించి రిమైండర్ వస్తుంది. అలాగే, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు స్లీప్ మోడ్ యాక్టివ్ అవుతుంది, దీనివల్ల నోటిఫికేషన్లు మ్యూట్ చేయబడతాయి.
తల్లిదండ్రులకు మరిన్ని నియంత్రణలు అందించేందుకు మెటా కొత్త సూపర్విజన్ టూల్‌ను త్వరలో ప్రారంభించనుంది. 16 ఏళ్ల పైబడి పిల్లల ఖాతాలను పర్యవేక్షించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. ముఖ్యంగా, వారు ఏ మెసేజ్‌లు తీసుకుంటున్నారు? ఎంత సమయం గడుపుతున్నారు? అన్న అంశాలను తల్లిదండ్రులు మానిటర్ చేయగలరు. అంతేకాదు, రోజువారీ టైం లిమిట్‌ను నిర్ణయించేందుకు కూడా వీలుగా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఇండియాలో పిల్లల ఆన్‌లైన్ భద్రతపై నేరుగా ఎలాంటి చట్టపరమైన ఆంక్షలు లేకపోయినా, ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్’ యాక్ట్ ప్రకారం పిల్లల డేటా సేకరించడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లల కోసం సోషల్ మీడియాను నిషేధించిన నేపథ్యంలో మెటా ఈ కొత్త మార్గదర్శకాలను అమలు చేసే దిశగా వెళ్తోంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్, భారతదేశం కోసం కొత్త గైడ్‌లైన్స్‌ను సిద్ధం చేస్తూ, టీనేజ్ ఖాతాలకు మరింత భద్రతను అందించేందుకు ప్రయత్నిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates