బెంగళూరులో ఇటీవల అరెస్టైన ఓ దొంగ కథ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 37 ఏళ్ల పంచాక్షరి స్వామి అనే దొంగను ఇటీవల మడివాళ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన అతడు తన చిన్నతనం నుంచే దొంగతనాలు చేస్తూ బడా క్రిమినల్‌గా మారాడు. అయితే అతడి కేసులో ఆసక్తికర అంశం ఏమిటంటే.. అతడు తన ప్రేయసి కోసం ఏకంగా రూ.3 కోట్ల విలువైన ఇల్లు నిర్మించడం. అంతేకాకుండా, ఆమెకు లక్షల రూపాయల విలువైన బహుమతులు కూడా అందించాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
పోలీసుల సమాచారం ప్రకారం, పంచాక్షరి స్వామి 2003లో దొంగతనాలు ప్రారంభించాడు. 2009 కల్లా అతడు భారీ స్థాయిలో దోపిడీలు చేస్తూ కోట్లాది ఆస్తిని కూడబెట్టాడు. 2014-15లో ఓ ప్రముఖ సినీ నటి పరిచయం కావడంతో ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమెపై కోట్లు ఖర్చు పెట్టడంతో పాటు, కోల్‌కతాలో రూ.3 కోట్ల విలువైన ఇల్లు కట్టించి పెట్టాడు. అంతే కాదు, ఆమె కోసం రూ.22 లక్షల విలువైన ఫిష్ అక్వేరియం కూడా కొనుగోలు చేశాడు. అయితే, 2016లో గుజరాత్ పోలీసులు అతడిని అరెస్టు చేసి ఆరేళ్ల జైలు శిక్ష విధించారు.
అహ్మదాబాద్‌లోని సబర్మతి జైల్లో శిక్ష పూర్తయిన తర్వాత కూడా అతడు మారలేదు. జైలు నుంచి బయటకు వచ్చాక, మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డాడు. మహారాష్ట్ర పోలీసులు అతడిని మళ్లీ అరెస్టు చేశారు. జైలు శిక్ష పూర్తి చేసుకున్న అనంతరం 2024లో బెంగళూరుకు వచ్చి మడివాళ ప్రాంతంలో బీభత్సం సృష్టించాడు. జనవరి 9న అక్కడ ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన అతడిని, స్థానిక పోలీసులు ఇంటెలిజెన్స్ ఆధారంగా పట్టుకున్నారు. విచారణలో అతడు బెంగళూరుతో పాటు పలు నగరాల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు.
దర్యాప్తులో పోలీసులు అతడి వద్ద 181 గ్రాముల బంగారు బిస్కట్లు, 333 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి ఉపయోగించిన ఐరన్ రాడ్, ఫైర్ గన్ను కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా అతడు దొంగతనం చేసిన బంగారాన్ని ఫైర్ గన్‌తో కరిగించి బిస్కెట్లుగా మారుస్తూ.. వాటిని సోలాపూర్‌లోని తన ఇంట్లో దాచిపెట్టాడని తేలింది.
స్వామి తండ్రి మరణించడంతో అతని తల్లి రైల్వే శాఖలో ఉద్యోగం పొందినట్లు పోలీసులు తెలిపారు. అతడు కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉండటంతో, చాకచక్యంగా దొంగతనాలు చేసి పోలీసుల కంట పడకుండా ఉండేవాడు. అయితే, ఇప్పుడు అతడి నాటకాలన్నీ అంతమయ్యాయి. పోలీసులు అతడిపై మరిన్ని కేసులు నమోదు చేసి, ఆయన గత నేర చరిత్రను మరింత లోతుగా పరిశీలిస్తున్నారు.