భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్‌ను ప్రారంభించింది. ‘స్వరైల్ (SwaRail Superapp)’ పేరిట తీసుకురావబడిన ఈ యాప్ ప్రస్తుతం బీటా దశలో ఉంది. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండడంతో సాధారణ వినియోగదారులు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుండదు. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లలో కేవలం వెయ్యిమందికి మాత్రమే టెస్టింగ్ కోసం అవకాశం కల్పించారు.
ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిజర్వ్‌డ్ టికెట్లు, అన్‌రిజర్వ్డ్ టికెట్లు బుక్ చేయడం, పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేయడం, రైల్వే ఫుడ్ ఆర్డర్ చేయడం, పార్సెల్, సరకు రవాణా సేవలు పొందడం వంటి అనేక ఫీచర్లు పొందవచ్చు. అదనంగా, రైల్వేతో సంబంధమైన ఫిర్యాదులను కూడా ఈ యాప్ ద్వారానే నమోదు చేయొచ్చు. ఇప్పటి వరకు ఈ సేవలకు వేర్వేరు యాప్స్ ఉండగా, వాటన్నింటినీ ఒకే చోట కేంద్రీకరించడమే ఈ సూపర్ యాప్ ముఖ్య లక్ష్యం.
ఈ యాప్‌ను రూపొందించిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం బీటా టెస్టర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని కొన్ని మార్పులు, చేర్పులు చేయనున్నట్లు వెల్లడించారు. పూర్తిగా మెరుగైన వెర్షన్ సిద్ధమైతే, త్వరలో అన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
అలాగే, బీటా టెస్టింగ్ కోసం వినియోగదారుల సంఖ్యను పెంచే అవకాశమూ ఉంది. భవిష్యత్తులో ఈ యాప్ ద్వారా మరిన్ని కొత్త సేవలను జోడించనున్నారు. ప్రయాణికులు ఇకపై రైలు ప్రయాణానికి సంబంధించిన అన్ని సౌకర్యాలను ఒక్క యాప్‌లోనే పొందే అవకాశం ఉండటంతో, ఇది రైల్ ప్రయాణాలను మరింత సులభతరం చేయనుంది.