సూక్ష్మదర్శిని స్ఫూర్తితో మర్డర్ ప్లాన్ ?

సమాజం మీద సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావం పాజిటివ్ గా ఏమో కానీ నెగటివ్ అయితే ఖచ్చితంగా ఉంటుందనే దానికి బోలెడు సంఘటనలు సాక్ష్యాల రూపంలో కళ్ళముందు కనిపిస్తున్నాయి. ఇటీవలే మీర్ పేట్ కు చెందిన గురుమూర్తి అనే వ్యక్తి భార్యను అత్యంత దారుణంగా హత్య చేసి ఆచూకీ దొరక్కుండా చేసిన వైనం చదివిన వాళ్ళ ఒళ్ళు జలదరించేలా చేసింది.

అంత భయానకంగా ఎలా చంపాడాని మానవ హక్కుల సంఘాలు సైతం విస్తుపోయే పరిస్థితి. తక్కువ టైంలోనే అతన్ని పోలీసులు పట్టుకున్నారు కానీ గురుమూర్తి చెప్పిన విషయాలు విస్మయంతో పాటు విభ్రాంతికి గురి చేసేలా ఉన్నాయి.

విశ్వసనీయ సమాచారం మేరకు సూక్ష్మదర్శిని అనే మలయాళ చిత్రం చూసి తానీ హత్య చేసినట్టు గురు మూర్తి చెప్పాడట. ఇటీవలే ఇది ఓటిటిలో తెలుగు డబ్బింగ్ తో పాటు అందుబాటులోకి వచ్చింది. అందులో ఓ అమ్మాయిని మర్డర్ చేసే ఎపిసోడ్ ఇంటెన్స్ గా ఉంటుంది. దాన్ని చూసే ఇన్స్ పైర్ అయ్యాడేమో మరి. ఈ వార్తపై అధికారికంగా ధ్రువీకరణ రానప్పటికి సోషల్ మీడియా లో జోరున చక్కర్లు కొడుతుంది.

నిజానికి సూక్ష్మదర్శిని అనే కాదు గత కొన్నేళ్లుగా కొన్ని వెబ్ సిరీస్ లు సైకోలు చేసే హత్యలను చాలా కిరాతకంగా చూపిస్తున్నాయి. కన్నార్పకుండా చూస్తే రాత్రి నిద్ర కూడా పట్టనంత దారుణంగా ఉన్నాయి. ఏమైనా అంటే సహజత్వం పేరుతో దర్శక రచయితలు కింది స్థాయికి వెళ్తున్నారు.

వీటి మీద హాలీవుడ్ సిరీస్ ల ప్రభావం చాలా ఉంది. మన డైరెక్టర్లు వాటినే అందిపుచ్చుకుంటున్నారు. పైన చెప్పిన ఉదంతం ఒక హెచ్చరిక లాంటిది. సున్నితత్వం పోయి జనాలు మెకానికల్ లైఫ్ లో బండరాళ్ళుగా మారిపోతున్నారు. ప్రాణం విలువ తగ్గిపోయి డబ్బు వ్యామోహం పెరుగుతోంది.

అందుకే నేరాలు ఘోరాలు విచ్చలవిడిగా పేట్రేగిపోతున్నాయి. ఇలాంటి పోకడలో కొన్ని సినిమాలు స్ఫూర్తినిస్తున్న వైనం ప్రమాదాలకు దారి తీస్తోంది. కేవలం సూక్ష్మదర్శినిని మాత్రమే నిందించలేం. ఇంతకన్నా దారుణమైన బోలెడు హింసాత్మక కంటెంట్ ఓటిటిల్లో ఉంది. నియంత్రణ లేనంత కాలం ఇవి రిపీటవుతూనే ఉంటాయి.