హుస్సేన్ సాగర్ లో భారీ అగ్ని ప్రమాదం… తప్పిన ప్రాణ నష్టం

భాగ్యనగరి హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉండి ఉన్నా… భారీ ప్రాణ నష్టమే సంభవించేది.

అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడం, ఆదివారం సెలవు దినం కావడంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో అప్పటికీ ఇంకా జన సందోహం భారీగా ఉన్న నేపథ్యంలో… ప్రమాదం జరిగిన విషయాన్ని క్షణాల్లో గమనించి అందరూ అప్రమత్తతో వ్యవహరించారు. ఫలితంగా భారీ ప్రాణ నష్టం తప్పింది.

ఈ ప్రమాదం జరిగిన తీరు కూడా అందరినీ షాక్ కు గురి చేసింది. హుస్సేన్ సాగర్ లో బోటు షికారు జోరుగానే సాగుతోంది. సెలవు కావడంతో రాత్రి అయినా కూడా పర్యాటకులు అధికంగా ఉండటంతో బోట్లు షికారుకు వెళ్లాయి. అదే సమయంలో హుస్సేన్ సాగర్ కు ఓ వైపున ఉన్న నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భరత మాతకు మహా హారతి పేరిట ప్రత్యేక కార్యక్రమం జరుగుతోంది.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భారీ ఎత్తున బాణా సంచా కాల్చారు. ఈ బాణా సంచా నుంచి వెలువడిన నిప్పురవ్వలు నేరుగా వచ్చి షికారులోని బోట్లపై పడ్డాయి. ఆ వెంటనే బోట్లు రెండూ అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి.

బోట్లు అగ్ని కీలలకు చిక్కుకున్న సమయంలో రెండు బోట్లలో దాదాపుగా 15 మందికిపైగా జనం ఉన్నారు. బోట్లలో మంటలను చూసినంతనే వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బోట్లలో నుంచి నీటిలోకి దూకేశారు. ఆ తర్వాత నిమిషాల్లోనే బోట్లు రెండూ అగ్నికి ఆహుతి అయ్యాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు పర్యాటకులకు గాయాలైనట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే… బోట్లలోనే టపాసులు పేల్చిన కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.