తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి చేసి చంపడం షాక్ కు గురి చేసింది. ఈ సంఘటన సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీమార్ట్ ఎదురుగా జరిగింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
మడికొండకు చెందిన ఆటోడ్రైవర్ రాజ్‌కుమార్‌పై మరో ఆటోడ్రైవర్ వెంకటేశ్వర్లు కత్తితో దాడి చేయడంతో, రాజ్‌కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చుట్టూ జనాలు ఉన్నా కూడా కొందరు మాత్రమే దాడిని ఆపేందుకు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ గొడవ ఆగలేదు. ఇక అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎంకు తరలించారు.
దాడికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పోలీసులు సునిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా కనిపిస్తోందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడికి పాత గొడవలేమైనా కారణమా లేక తాజాగా ఏర్పడిన సమస్యల కారణమా అన్నది విచారణలో తేలనుంది. ప్రస్తుతం వెంకటేశ్వర్లు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని ప్రశ్నించడం ద్వారా మరిన్ని వివరాలు వెలుగు చూడనున్నాయి. ప్రజల ముందు జరిగిన ఈ దారుణం, హనుమకొండలో అందరికీ భయాందోళన కలిగించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates