టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు.. భారత్ అభ్యంతరం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా జరగనున్న ఈ ట్రోఫీపై ఇప్పటికే పలు రకాల వివాదాలు హైలెట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో కొత్త వివాదం చెలరేగింది. భారత జట్టు జెర్సీలపై ఆతిథ్య దేశం పాకిస్థాన్ పేరు ఉండాలన్న ఐసీసీ నిబంధనకు బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

జెర్సీలపై పాకిస్థాన్ పేరు ముద్రించడం తగదని భారత్ తేల్చిచెప్పినట్లు సమాచారం. సాధారణంగా ఐసీసీ టోర్నీలలో ఆతిథ్య దేశం పేరు జెర్సీలపై ఉండటం ఆనవాయితీ. అయితే భారత్ తమ మ్యాచ్‌లు ప్రధానంగా దుబాయ్ వేదికగా ఆడతామని, కాబట్టి పాకిస్థాన్ పేరు జెర్సీలపై ఉండబోదని బీసీసీఐ స్పష్టం చేసింది. దీనిపై ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రతి జట్టూ టోర్నీ లోగో, ఆతిథ్య దేశం పేరును తమ జెర్సీలపై ముద్రించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఐసీసీ ప్రతినిధి ఒకరు, “టోర్నమెంట్ నియమాలను ప్రతి దేశం పాటించాల్సిందే. జెర్సీలపై టోర్నీ లోగో, ఆతిథ్య దేశం పేరు లేకపోతే భారత జట్టుపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది,” అని పేర్కొన్నారు. బీసీసీఐ దీనిపై తమ నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం తీసుకోనుందని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా బీసీసీఐ, పీసీబీ మధ్య ఉన్న ఉద్రిక్తతలు ఈ వివాదానికి దారి తీసినట్లు అనిపిస్తోంది.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాకిస్థాన్ పంపే విషయంపై భారత్ అసహనం వ్యక్తం చేయగా, చివరికి టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి పీసీబీ ఒప్పుకుంది. ఇది భారత్-పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలపై మరింత ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐసీసీ టోర్నీలకు సంబంధించి భవిష్యత్తులో మరింత కఠినమైన నిబంధనలు అమలు అయ్యే అవకాశముంది.