నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో దుబాయిలోనే, లేదంటే… ఇంకే దేశంలోనో కాదు… మన దేశంలోని వ్యవసాయ రాష్ట్రం పంజాబ్ కు చెందిన లారీ డ్రైవర్ ఒకరు రాత్రికి రాత్రి ఇలా కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఆ లారీ డ్రైవర్ కేవలం రూ.500 పెట్టి కొన్న ఓ లాటరీ టికెట్ అతడికి ఏకంగా రూ.10 కోట్లను ఆర్జించి పెట్టింది. వెరసి అతడు ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు.
హర్పిందర్ సింగ్ ఓ లారీ డ్రైవర్. పంజాబ్ లోని రోపర్ జిల్లాలోని బర్వా గ్రామానికి చెందిన ఇతడు కువైట్ లో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి వేడుకల కోసం ఇంటికి వచ్చిన సింగ్…తన గ్రామానికి సమీపంలోని నుర్పూర్ బేడికి ఈ నెల 12న వెళ్లాడు. ఆ సందర్భంగా అక్కడ అమ్ముతున్న పంజాబ్ స్టేట్ లోహ్రీ మకర్ సంక్రాంతి బంపర్ లాటరీలో ఓ టికెట్ ను రూ.500 పెట్టి కొన్నాడు. దానిని జేబులో పెట్టేసుకుని తిరిగి తన గ్రామానికి వచ్చేశాడు. ఆ తర్వాత దాని విషయాన్ని అతడు మరిచిపోయాడు.
అయితే తాజాగా సదరు లాటరీ ఓపెన్ అయిపోగా… సింగ్ కు తాను లాటరీ టికెట్ కొన్న విషయం గుర్తుకు వచ్చింది. కుమారుడు దేవీదర్ సింగ్ ను వెంటబెట్టుకుని అతడు నుర్పూర్ బేడికి వెళ్లి… తాను ఎక్కడైతే లాటరీ టికెట్ కొన్నాడో అదే షాపునకు వెళ్లి తన టికెట్ చూపించాడు. ఇంకేముంది… సింగ్ కొన్న టికెట్ ఆ లాటరీలో విన్నర్ గా నిలిచింది. ఈ మాట విన్నంతనే సింగ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రూ.500లతో కొన్న లాటరీ టికెట్ తో తాను ఏకగా రూ.10 కోట్లు గెలిచానంటూ అతడు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాడు.
లారీ డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న సింగ్ కుటుంబం అప్పుల్లో ఉంది. రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగ్ కుమారుడికి ఓ కాలు, చేయి సరిగ్గా పనిచేయడ లేదు. అతడికి వైద్య చేయించడమే సింగ్ కు తలకు మించిన భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు తగిలిన లాటరీతో సింగ్ కుటుంబలో సరికొత్త ఆశలు చిగురించాయి. లాటరీతో వచ్చిన ధనంతో తన కుమారుడికి మెరుగైన వైద్యం చేయిస్తానని సింగ్ చెబుతుంటే… అప్పులను తీర్చుకుని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తామని అతడి కుమారుడు చెబుతున్నాడు. తమలాంటి పేద వారి అభ్యున్నతి కోసం కొంత మొత్తాన్నివెచ్చించనున్నట్లు సింగ్ చెబుతున్నాడు.