మ‌హా కుంభ మేళాలో అగ్ని ప్ర‌మాదం.. ఎవ‌రిది త‌ప్పు?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని త్రివేణీ సంగ‌మం(గంగ‌, య‌మున, స‌రస్వ‌తి న‌దులు సంగ‌మించే చోటు)లో ఈ నెల 13 నుంచి నిర్వ‌హిస్తున్న మ‌హా కుంభ‌మేళాకు దేశ విదేశాల నుంచి భ‌క్తులు పోటెత్తుతున్నారు. ఈ మేళా వ‌చ్చే నెల 26వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. దీనిని యూపీ ప్ర‌భుత్వం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసింది. అయితే.. ఎన్ని ఏర్పాట్లు చేసినా.. మాన‌వ త‌ప్పిదాల కారణంగా మ‌హా కుంభ‌మేళాలో తాజాగా భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది.

ఏం జ‌రిగింది?

వివిధ ప్రాంతాల‌కు చెందిన స్వ‌చ్ఛంద సంస్థ‌లు, అఖాడాల‌కు కుంభ‌మేళాలో చోటు క‌ల్పించారు. ఆయా సంస్థ‌లు అక్క‌డే గుడారాలు వేసుకుని భ‌క్తుల‌కు సేవ‌లు చేస్తున్నాయి. ఇలా.. యూపీలోని గోర‌ఖ్‌పూర్‌కు చెందిన ‘గీతాప్రెస్‌’ సంస్థ‌కు కూడా 19వ నెంబ‌రు గుడారాన్ని కేటాయించారు. దీనిలోనే నిర్వాహ‌కులు వంట చేసుకుని.. ఇక్క‌డే నివ‌సిస్తున్నారు. ఇలా 2వేల‌కు పైగా గుడారాలు ఉన్నాయి. అయితే.. 19వ నెంబరు గుడారంలో వంట చేసుకునేందుకు సిలిండ‌ర్ల‌ను ఏర్పాటు చేసుకున్నారు.

వీటిని నిర్వాహ‌కులు నిర్ల‌క్ష్యంగా వ‌దిలి వేయ‌డంతో ఒక సిలిండ‌ర్ ఆదివారం సాయంత్రం 5 గంట‌ల స‌మయంలో అక‌స్మాత్తుగా పేలిపోయింది. దీంతో మంట‌లు చెల‌రేగి.. ప‌క్క‌నే ఉన్న మ‌రికొన్ని గుడారాల‌కు కూడా వ్యాపించాయి. తొలుత చిన్న‌దిగానే మొద‌లైనా.. త‌ర్వాత త‌ర్వాత‌.. మంట‌లు భారీగా రాజుకు న్నాయి. దీంతో హ‌డ‌లిపోయిన భ‌క్తులు.. స‌మీప ప్రాంతాల‌కు ప‌రుగులు తీశారు. అయితే.. ఘ‌ట‌నా స్థ‌లానికి కొంచెం దూరంలోనే ఏర్పాటు చేసిన ఫైర్ ఇంజ‌న్లు.. అక్క‌డ‌కు చేరుకుని మంట‌లు ఆర్పే ప్ర‌య‌త్నం చేసినా భారీ గాలుల కార‌ణంగా.. మంట‌లు అదుపులోకి రాలేద‌ని అధికారులు తెలిపారు.

ఎంత న‌ష్టం..

ఈ అగ్ని ప్ర‌మాదం కార‌ణంగా.. ప‌దుల సంఖ్య‌లో గుడారాలు కాలిపోగా.. ల‌క్ష‌ల కొద్దీ పుస్త‌కాలు, పూజా సామాగ్రి కాలి బూడిదైన‌ట్టు అధికారులు తెలిపారు. అయితే.. భ‌క్తులు ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని.. ప‌గ‌టి పూట కావ‌డంతో అంద‌రూ అప్ర‌మ‌త్తంగానే ఉన్నార‌ని వివ‌రించారు. కాగా, ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న యూపీ ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది.