ఇది మాటలకందని విషాదం. నూడుల్స్ తినడం వల్ల ఒకే కుటుంబంలోని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యక్తి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. కాకపోతే ఈ విషాదం చోటు చేసుకుంది చైనాలో. ఆ దేశం నూడుల్స్‌కు ప్రసిద్ధి అన్న సంగతి తెలిసిందే. నూడుల్స్ వచ్చిందే అక్కడి నుంచి. నూడుల్స్ విషయంలో చైనీయులు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఈశాన్య చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని ఓ కుటుంబం సొంతంగా నూడుల్స్ తయారు చేసుకుని తినగా.. అది విషాహారంగా మారి ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి.
వాళ్లు తిన్న నూడుల్స్‌ను పరీక్షించగా.. అందులో బాంగ్క్రెకిక్ యాసిడ్ అనే విషతుల్యమైన రసాయనం ఉన్నట్లు తేలింది. ఈ రసాయనం ఎంత వేడిలో ఉడికించినా కూడా దాని ఉనికిని కోల్పోదు. ఇది ఎక్కువ మోతాదులో కడుపులోకి వెళ్తే ఏ మందుతోనూ రోగిని ట్రీట్ చేయలేమన్నది వైద్య నిపుణుల మాట. కార్న్ ఫ్లోర్ నుంచి తయారు చేసే సువాటంగ్‌జి అనే తరహా నూడుల్స్‌తో వాళ్లు ఈ వంటకం చేశారట. ఫ్లోర్ ప్రాడెక్ట్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వల్ల ఫంగస్ ఏర్పడి అది విషంగా మారుతుందని వైద్యులంటున్నారు.
ఏడాది పాటు ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన నూడుల్స్ తీసి వండటం వల్ల అది విషాహారంగా మారి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. సదరు కుటుంబం విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చన్న కోణంలో విచారణ జరిపిన పోలీసులు అలాంటిదేమీ లేదని తేల్చారు. 12 మంది సభ్యులున్న ఈ కుటుంబం ఇటీవల ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం నూడుల్స్ తయారు చేసుకుంది. తొమ్మిది మంది నూడుల్స్ తినగా.. ముగ్గురికి టేస్ట్ నచ్చక తినకుండా పక్కన పెట్టేయడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.