అది బంగారు గని! తవ్వుకుంటే సిరులే!! కాకపోతే.. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవు. అయినా.. కొందరు పేదలు.. ఈ గనుల్లోకి వెళ్లి అంతో ఇంతో బంగారం తెచ్చుకుని గుట్టుమట్టుగా విక్రయించుకుని జీవితాలను పోషించుకుంటున్నారు.
ఇదంతా కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నదే. ఆయా గనుల్లోని బంగారాన్ని ప్రభుత్వం తవ్వించే అవకాశం ఉన్నా.. ప్రమాదాల కారణంగా ఆయా గనులను వదిలేసింది. దీంతో అవి పేదలకు వరంగా మారాయి.
అయితే.. ఈ పనిని నేరంగా భావించిన ప్రభుత్వం వాటిని అనూహ్యంగా మూసేసింది. దీంతో అప్పటికే బంగారం కోసం వెళ్లిన 500 మందికిపైగా పేదలు.. ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. వీరిలో సుమారు 200 మందివరకు మరణించి ఉంటారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
వారిని తక్షణం బయటకు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సర్కారుకు శవాలు తప్ప.. జీవించి ఉన్న మనుషులు చాలా తక్కువగా కనిపిస్తున్నారని అర్థమైంది.
ఎక్కడ?
పేదరికంలో రెండు మూడు స్థానాల్లో ఉన్న దక్షిణాఫ్రికాలో బంగారు నిక్షేపాలు అధికం. ఇవే ఆదేశానికి వనరులు కూడా. అయితే.. కొన్ని గనులు ప్రమాదకరం కావడంతో వాటిని ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఇక, వీటిలో ఉన్న బంగారాన్ని సొంతం చేసుకునేందుకు పలు రాష్ట్రాల పేదలు.. సాహసోపేతంగా వీటిలో కి వెళ్లి అందిన బంగారాన్ని తెచ్చుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇలా.. రెండు మాసాల కిందట 500 మంది వరకు గనుల్లోకి వెళ్లారు. ఈ విషయం తెలిసిన ప్రభుత్వం వెంటనే గని మార్గాలను మూసేసింది.
దీంతో లోపలికి వెళ్లిన వారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. పైగా.. వారు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలను కూడా అధికారులు కూల్చేశారు. ఇది మరింత దారుణంగా మారిపోయింది. దీంతో లోపలికి వెళ్లిన వారికి ఆహారం, నీరు లేకుండా పోయింది. ఫలితంగా వందల మంది చనిపోయారు.
ఈ విషయం నెమ్మదిగా వెలుగు చూడడంతోపాటు రాజకీయ పక్షాల నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం బాధితులను బయటకు తెచ్చే ప్రయత్నం చేసింది. కానీ, వందల కొద్దీ శవాలు మాత్రమే ఇప్పటి వరకు బయటకు రాగా.. కేవలం పది మంది మాత్రం కొన ఊపిరితో బయట పడ్డారు.