90 గంటల పనిపై ఆనంద్ మహీంద్ర: ఇచ్చిపడేశాడు!

కార్పొరేట్ కంపెనీలు ఇటీవల కాలంలో పని ఒత్తిడితో పాటు టైమ్ ను కూడా మెల్లగా పెంచుతున్న విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా పని-జీవిత సమతుల్యతపై చర్చలు జరుగుతుండగా, వారానికి 90 గంటల పని చేయాలని కొందరు కార్పొరేట్ ప్రముఖులు సూచించడం వివాదాస్పదంగా మారింది. లార్సెన్ అండ్ టూబ్రో (L&T) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్ సైతం వీలైతే ఆదివారాలు కూడా పనికి హాజరవాలని అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యల మధ్య మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర తన అభిప్రాయం సూటిగా వెల్లడించారు. ఆనంద్ మహీంద్రా పనిగంటల బేరీజు కంటే పని నాణ్యత ముఖ్యం అని స్పష్టం చేశారు. ‘‘ఎన్ని గంటలు పనిచేశామనే దానికంటే, ఆ పని ఎంత నాణ్యతగా చేశామనే విషయమే ముఖ్యమైంది’’ అని అన్నారు.

ఆయన వివరణ ప్రకారం, పని గంటలు పెంచడం వల్ల ఉత్పాదకతకు ఎటువంటి ప్రయోజనం ఉండదని, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలంటే సరైన సమతుల్యత అవసరమని అభిప్రాయపడ్డారు. ఇక, నారాయణ మూర్తి వంటి ప్రముఖులు 70-90 గంటల పని పద్ధతిని సూచించడం పై ఆయన స్పందిస్తూ, ‘‘నేను వారిని గౌరవిస్తాను, కానీ ఈ చర్చ తప్పు దిశలో సాగుతోంది’’ అని వ్యాఖ్యానించారు.

పని గంటలపై కాకుండా అవుట్‌పుట్‌ మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని, గంటల ఎక్కువతా ప్రభావం ఉత్పాదకతపై తగ్గుతుందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో, దేశంలోని చాలా ప్రాంతాల్లో నాలుగు రోజుల పని విధానం చర్చనీయాంశం అవుతుండగా, ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. ‘‘90 గంటలు పనిచేసినా, అవుట్‌పుట్‌ ఉంటేనే గొప్ప’’ అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.