ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు నిర్మించేందుకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు ఆర్థిక, వాణిజ్య అవసరాల కోసం కీలకమైనవిగా భావిస్తున్నారు. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో ఈ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి పౌరవిమానయాన శాఖ అధికారులతో సమావేశమై, ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.
ప్రధానంగా కుప్పం విమానాశ్రయం రెండు దశల్లో నిర్మించనున్నారు. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలను కేటాయించారు. శ్రీకాకుళం విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన ఫీజిబిలిటీ సర్వే పూర్తయ్యింది. దగదర్తి విమానాశ్రయం కోసం 1,379 ఎకరాలు అవసరమని తేలింది. నాగార్జునసాగర్‌లో 1,670 ఎకరాలు, తుని-అన్నవరం మధ్య 757 ఎకరాలు గుర్తించారు.
గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా నూతన టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం ఆకృతుల్లో నిర్మించనున్నారు. ఈ నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భోగాపురం విమానాశ్రయం పురోగతిపై సమీక్ష చేపట్టింది. తెదేపా హయాంలో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులు వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత నిలిచిపోయాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మళ్లీ వాటిని అమలు చేయడానికి కృషి చేస్తుందని చంద్రబాబు తెలిపారు. కొత్త విమానాశ్రయాలతో ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిచ్చే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates