కొత్త ట్రెండ్: కోట్లు ఉన్నా.. కొనేది సెకండ్ హ్యాండ్ దుస్తులే

అవును.. మీరు చదివింది నిజమే. ఇలాంటి వాళ్లు ఉంటారా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఇప్పుడు ఇదే పెద్ద ట్రెండ్ గా మారింది. రూ.కోట్లకు కోట్లు ఆస్తులున్నప్పటికి.. వారు సాదాసీదాగా జీవించే ధోరణి ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారింది. ఉన్నదాంట్లో విలాసవంతంగా జీవించే ధోరణికి చెక్ చెబుతూ.. కలలో కూడా ఊహించనంత సాదాసీదాగా బతికే కొత్త తీరుకు పలువురు బిలియనీర్లు ఓటేస్తున్నారు. ఓవైపు మధ్యతరగతి.. దిగువ మధ్యతరగతి వారు ఉన్న దాన్లోనే వీలైనంత రిచ్ గా బతికేందుకు ప్రయత్నిస్తుంటే.. రివర్సులో కోటీశ్వరులు మాత్రం సాదాసీదాగా బతికేందుకు మొగ్గు చూపే ధోరణి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు పెరుగుతోంది.

అందుకు ఉదాహరణగా బోలెడంత మంది కనిపిస్తున్నారు. హార్వర్డ్ లో విద్యను అభ్యసించిన షాంగ్ సావెడ్రా అనే వ్యాపారవేత్త.. ఒక పర్సనల్ ఫైనాన్స్ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నారు. ఆమె…ఆమె జీవిత భాగస్వామి లాస్ ఏంజెలెస్ లో నివసిస్తుంటారు. వీరిద్దరు మల్టీ మిలియనీర్లు. కానీ..వారి జీవన విధానం చూస్తే.. మధ్యతరగతి వారి కంటే తక్కువగా కనిపిస్తారు. వారిని చూసిన వారెవరు కూడా.. వారి దగ్గర మిలియన్ల కొద్దీ డాలర్లు ఉంటాయని అస్సలు అనుకోరు.

వారి వరకు వారికి అదే హాయిగా.. ప్రశాంతంగా ఉంటారు. అంతేకాదు.. వారు తలచుకుంటే లగ్జరీ విల్లాను కొనుగోలు చేసే సత్తా ఉంది. కానీ.. అది వదిలేసి.. ఫోర్ బెడ్రూం ఇంటిని అద్దెకు తీసుకొన్నారు. వారు వాడే కారు అక్షరాల పదహారేళ్ల క్రితం నాటిది. వారి పిల్లలకు సెకండ్ హ్యాండ్ దుస్తులు.. సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టిన ఆట బొమ్మల్ని కొనుగోలు చేసి తమ పిల్లలకు ఇస్తుంటారు. ఇదంతా చూసి.. వీళ్లను పీనాసులు.. బతకటం చేతకాదని ట్యాగ్ తగిలిస్తే తప్పులో కాలేసినట్లే. ఎందుకుంటే వీరు పెద్ద ఎత్తున దాన ధర్మాల్ని చేస్తుంటారు. వారి జీవన శైలి వారికి ఇప్పుడు ఎంతో ఆనందాన్ని.. సంతోషాన్ని కలిగిస్తుందని వారు చెబుతారు.

ఒక్క షాంగ్ దంపతులే కాదు.. ప్రాశ్చత్య దేశాల్లో ఈ తరహా సింఫుల్ లివింగ్ కాన్సెప్టు అంతకంతకూ పెరుగుతోంది. ఉత్తి పుణ్యానికి తమవద్ద ఉన్న సంపదను విలాసాలకు వినియోగించటం.. లగ్జరీ వస్తువుల్ని కొనేందుకు ఆసక్తి చూపకపోవటం లాంటివి ఇప్పుడు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. సింఫుల్ లివింగ్ లో భాగంగా ఇంటి ఫుడ్ ను మాత్రమే తినటం.. రెస్టారెంట్లకు వెళ్లి తినటాన్ని మానేయటం.. కిరాణా సరుకుల్ని హోల్ సేల్ గా కొనటం.. విమానప్రయాణాల్లో ఎకానమీలో ప్రయాణించటమే కాదు..డిస్కౌంట్లు.. ఆఫర్లు ఉన్న వాటికే అధిక ప్రాధాన్యతను ఇవ్వటం లాంటివి చేస్తున్నారట.

మరికొందరు అయితే.. తాము పెద్దగా వినియోగించని వస్తువుల్ని కూడా అమ్మేస్తున్నారట. కొందరు కారు వినియోగం ఎక్కువగా లేకపోతే వాటిని అమ్మేస్తున్నారు. అదేదో డబ్బులు అవసరమై కాదు.. సింఫుల్ లివింగ్ లో భాగంగా ఇలాంటి చర్యల్ని చేపడుతున్నారట. అత్యంత సాదాసీదా జీవితాన్ని జీవిస్తూ.. ఆస్తుల్ని భారీగా కూడబెట్టేయటం.. దాన ధర్మాలకు వాటిని వెచ్చిస్తూ ఉండటం ఇప్పుడు ఒక ఫ్యాషన్ గా మారిందంటున్నారు. ఈ లైఫ్ స్టైల్ ను చూస్తే.. అదేదో సినిమాలో డైలాగ్ మాదిరి.. ‘సంపన్నుల కష్టాలు మామూలుగా లేవుగా’ అనుకోకుండా ఉండలేం కదా?