USA: భారతీయులను భయపెడుతున్న ఓపీటీ రచ్చ

అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు వృత్తి అవకాశాల కోసం ఓపీటీపై చాలా ఎక్కువగా ఆధారపడుతున్నారు. హెచ్‌1బీ వీసాలు పొందేందుకు ఈ ప్రోగ్రామ్‌ వారికి తొలి మెట్టుగా మారింది. ప్రతీ ఏడాది ఎక్కువ సంఖ్యలో యూఎస్ కు వెళుతున్న విద్యార్థులలో భారతీయులు కూడా ఉన్నారు. అయితే అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో వాడుతున్న ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ప్రోగ్రామ్‌పై విమర్శలు తీవ్రంగా పెరుగుతున్నాయి.

విద్యార్థులకోసం ప్రారంభించిన ఈ ప్రోగ్రామ్‌ దేశీయ ఉద్యోగాలపై ప్రభావం చూపుతోందని, స్థానిక అమెరికన్లకు అన్యాయం జరుగుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. ఓపీటీ కింద ఎఫ్-1 వీసా విద్యార్థులు మూడేళ్లపాటు పని అనుభవం పొందవచ్చు. అయితే, దీన్ని విద్యార్థులు వలస విధానానికి వేదికగా ఉపయోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఓపీటీ ప్రోగ్రామ్‌ నిర్వహణకు అమెరికా కాంగ్రెస్‌ అనుమతి లేదని, ఇది ఆ దేశ చట్టాలకు విరుద్ధమని కొన్ని వర్గాలు అంటున్నాయి. విదేశీ విద్యార్థులు అమెరికన్‌ ఉద్యోగాలతో పోటీపడటం వలన స్థానిక టెక్ వర్కర్లకు అవకాశాలు తగ్గుతున్నాయని వారంటున్నారు. టెక్ వర్కర్స్ గ్రూప్ ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, విదేశీ విద్యార్థులకు విద్యాశాఖలు వర్క్ పర్మిట్‌లు విక్రయిస్తున్నాయని ఆరోపించింది.

ఓపీటీపై ఉన్న వివాదాలు ఇలానే కొనసాగితే, భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారే అవకాశముంది. ఇప్పటికే విదేశీ విద్యార్థుల ఉద్యోగ పోటీని సమర్థించుకున్న న్యాయస్థానం ఓపీటీని సమర్థించినప్పటికీ, కొందరు చట్టసభ సభ్యులు దీనిపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని కోరుతూ చట్టసభలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ట్రంప్‌ అనుచరులు దేశీయ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ ఈ ప్రోగ్రామ్‌ను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీటీ విధానం భవిష్యత్తులో ఎలా మారుతుందో చూడాలి.