మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ఆస్ట్రేలియా యువ క్రికెటర్ సామ్ కొన్ స్టాస్ తన నోటికి పని చెప్పాడు. మ్యాచ్ మొదటి నుంచే స్లెడ్జింగ్ చేయడం ప్రారంభించిన కొన్ స్టాస్, యశస్వి ఏకాగ్రతను భంగం కలిగించేందుకు ప్రయత్నించాడు. అయితే, తనదైన శైలిలో యశస్వి సమాధానం ఇవ్వడం మ్యాచ్‌కు ప్రధాన హైలైట్‌గా మారింది.
స్పిన్నర్ నాథన్ లైయన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో, సామ్ కొన్ స్టాస్ వికెట్స్ కు దగ్గరగా ఫీల్డింగ్ చేస్తూ తన మాటలతో జైస్వాల్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాడు. దానికి యశస్వి “నీ పని చేసుకో” అంటూ గట్టిగా చెప్పాడు. ఈ సంఘటనపై కామెంటేటర్లు కూడా స్పందిస్తూ, యశస్వి ధైర్యానికి ప్రశంసలు కురిపించారు. అయితే, కొన్ స్టాస్ మాటలతో మాత్రమే ఆగలేదు. ప్రతి బంతికి రకరకాల వ్యాఖ్యలు చేస్తూ మరింత ఉత్సాహంగా కనిపించాడు.
ఆ తర్వాత ఓవర్‌లో లైయన్ ఓవర్ పిచ్ బంతిని వేయగా, యశస్వి తన శక్తినంతా పెట్టి బంతిని గట్టిగా ఆఫ్ సైడ్ దిశగా కొట్టాడు. బంతి నేరుగా సిల్లీ మిడ్ ఆఫ్ వద్ద ఉన్న కొన్ స్టాస్ డొక్కలో తగిలింది. ఈ షాట్‌తో కొన్ స్టాస్ నొప్పితో వంగిపోయాడు. ఇది చూసి కామెంట్రీ బాక్స్‌లో ఉన్న ఇర్ఫాన్ పఠాన్ సహా ఇతర కామెంటేటర్లు “యశస్వి సమాధానం సరిగ్గా చెప్పాడు” అంటూ నవ్వుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అభిమానులు యశస్వి ధైర్యానికి, స్లెడ్జింగ్‌కు సమర్థమైన బౌన్సర్ ఇచ్చిన తీరు గమనించి హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్లెడ్జింగ్ అంటేనే ఆస్ట్రేలియా జట్టుకు ప్రత్యేకత. కానీ, యువ క్రికెటర్లు కూడా ఇప్పుడు తగిన జవాబు ఇవ్వగలరని ఈ సంఘటన రుజువు చేసింది. యశస్వి ప్రదర్శన అతడి ఆటను మాత్రమే కాకుండా అతడి ఆత్మస్థైర్యాన్ని కూడా తెలియజేస్తోంది.