అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ విజయంతో టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టును భారత బౌలర్లు 19 ఓవర్లలోనే 159 పరుగులకు కట్టడి చేసి ఆలౌట్ చేశారు. ఈ గెలుపు కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదు, గత 19 ఏళ్ల టీ20 ప్రపంచకప్ చరిత్రను తిరగరాసిన అద్భుత ఘట్టం.
ఈ విజయంతో వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో గెలిచిన భారత్, ఇప్పుడు 2026లోనూ అదే జోరును కొనసాగించి ట్రోఫీని నిలబెట్టుకుంది. గతంలో వెస్టిండీస్, ఇంగ్లాండ్ వంటి జట్లు రెండేసి సార్లు కప్పు గెలిచినప్పటికీ, వరుస ఎడిషన్లలో విజేతలుగా నిలవడం మాత్రం కేవలం భారత్‌కే సాధ్యమైంది.
మొత్తంగా ఇది భారత్‌కు మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్. 2007లో ధోనీ సారథ్యంలో తొలిసారి, 2024లో రోహిత్ ఆధ్వర్యంలో రెండోసారి కప్పు గెలిచిన టీమ్ ఇండియా, ఇప్పుడు మూడో టైటిల్‌ను తన సొంతం చేసుకుంది. ప్రపంచంలో మూడుసార్లు ఈ పొట్టి కప్పును ముద్దాడిన ఏకైక జట్టుగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. విశేషమేమిటంటే, రెండో టైటిల్ కోసం 17 ఏళ్లు వేచి చూసిన భారత్, మూడో టైటిల్‌ను మాత్రం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే సాధించడం గమనార్హం.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక అరుదైన రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. టీ20 ప్రపంచకప్ మొదలైన 19 ఏళ్ల చరిత్రలో సొంత గడ్డపై ట్రోఫీని అందుకున్న తొలి కెప్టెన్‌గా సూర్య నిలిచాడు. గతంలో ఏ దేశ కెప్టెన్ కూడా తమ దేశంలో జరిగిన ఫైనల్లో కప్పు గెలవలేదు. భారత్ గతంలో గెలిచిన రెండు ప్రపంచకప్‌లు కూడా దక్షిణాఫ్రికా, బార్బడోస్ వేదికలుగా జరిగినవే. ఇప్పుడు అహ్మదాబాద్‌లో గెలవడం ద్వారా ఆ లోటు కూడా తీరిపోయింది.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో సంజూ శాంసన్ బ్యాటింగ్‌తో అలరించగా, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌తో కివీస్ కి వణుకు పుట్టించాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించడం వల్లే భారత్ ఇంత భారీ విజయాన్ని అందుకోగలిగింది. ముఖ్యంగా ఒత్తిడి ఉండే ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ లాంటి పటిష్టమైన జట్టును అతి తక్కువ స్కోరుకే పరిమితం చేయడం భారత బౌలర్ల సత్తాకు నిదర్శనం. 2007, 2024, 2026 ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, టీ20 ఫార్మాట్‌లో తన ఎదురులేని ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అహ్మదాబాద్ మైదానంలో వేలాది మంది అభిమానుల మధ్య భారత్ సృష్టించిన ఈ వండర్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. మూడోసారి కప్పు గెలిచిన భారత్ ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌కు అసలైన బాస్ అని నిరూపించుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates