ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఔట్ తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆసీస్ నిర్దేశించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు వరుసగా విఫలమవుతుండగా, జైస్వాల్ మాత్రం నిలకడగా ఆడుతూ భారత జట్టుకు ఆశలు చిగురింపజేశాడు. కానీ 84 పరుగుల వ్యక్తిగత స్కోరులో అతని ఔట్ తీరు వివాదాలకు కారణమైంది.
పాట్ కమిన్స్ బౌలింగ్‌లో 70.5 ఓవర్ వద్ద జైస్వాల్ బంతిని ఆడేందుకు ప్రయత్నించగా, అది వికెట్ కీపర్ చేతిలోకి వెళ్లింది. ఆసీస్ ప్లేయర్లు వెంటనే ఔట్ అని అప్పీలు చేశారు. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో కమిన్స్ రివ్యూ కోరాడు. రిప్లేలో స్నికో మీటర్‌లో ఎలాంటి స్పైక్స్ రాకపోయినప్పటికీ, బంతి గమనం మారినట్లు కనిపించడంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.
ఈ నిర్ణయం జైస్వీతోపాటు క్రికెట్ అభిమానుల్లోనూ అసంతృప్తి రేకెత్తించింది. థర్డ్ అంపైర్ తీర్పు బలహీనంగా ఉందని, స్నికో మీటర్‌లో స్పైక్స్ రాకపోతే ఔట్‌గా ఎలా ప్రకటించారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జైస్వాల్ నిష్క్రమణ సమయంలో తన అసహనాన్ని వ్యక్తం చేయగా, ఈ వివాదం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. థర్డ్ అంపైర్ నిద్ర పోతున్నాడా ఏంటీ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
అదేవిధంగా అక్షదీప్ వికెట్ కూడా ఇలాంటి చర్చకే దారితీసింది. బాల్ ట్రాకింగ్ లో బాల్ బ్యాట్ ను దాటుతుండగా ఎర్రటి మరకపడడం గమనించిన నెటిజెన్స్ అదెలా ఔట్ గా ప్రకటిస్తారు అనే విమర్శలు చేస్తున్నారు.
క్రీడా విశ్లేషకులు సాంకేతికతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్‌లో సాంకేతికత ఉపయోగంపై మరింత కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జైస్వాల్ ఔటైన తర్వాత భారత జట్టు పూర్తిగా కోలుకోలేక, 155 పరుగులకే ఆలౌట్ కావడం ఆడిన ప్రతి వికెట్ మరింత కీలకమని రుజువు చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates