హైదరాబాద్ మాదాపూర్‌లోని నాలెడ్జ్ సిటీలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సత్వ ఎలిక్విర్ భవనంలోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా నాలుగో అంతస్తుకు వ్యాపించడంతో భవనంలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బార్ అండ్ రెస్టారెంట్‌లో ఈ ప్రమాదం జరగడంతో ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు అధికారులు గుర్తించారు.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి యత్నించాయి. ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్‌లు పేలడంతో సమీప భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఐదో అంతస్తు పూర్తిగా దగ్ధం కాగా, నాలుగో అంతస్తులోనూ కొంత నష్టం జరిగినట్లు తెలిసింది. ఘటన స్థలంలో పెద్ద శబ్ధం రావడంతో సమీప ప్రాంత ప్రజలు ఆందోళన చెందారు. అలాగే బిల్డింగ్ పైన పొగ విస్తరించడం సమీప జనాలను ఆందోళన కలిగించింది.
అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్ల సాయంతో మంటలను సమర్థవంతంగా ఆర్పివేశారు. ఘటనా ప్రాంతంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీ భవనానికి చెందిన ఉద్యోగులను సురక్షితంగా బయటకు తరలించారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం ఏమీ జరగకపోవడం ఊరట కలిగించింది. అగ్ని ప్రమాదానికి అసలు కారణం తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావచ్చని అంటున్నారు. అయితే, పూర్తి వివరాలు తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతుంది.