పశ్చిమగోదావరిలో దారుణం: పార్శిల్‌లో మృతదేహం

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో దారుణం వెలుగుచూసింది. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న సాగి తులసి అనే మహిళ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోరగా, విద్యుత్ సామగ్రి పేరుతో పంపిన పార్శిల్‌లో మృతదేహం రావడం గ్రామస్తులను షాక్‌కు గురి చేసింది. తులసి క్షత్రియ సేవా సమితికి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవడంతో తొలి విడతలో టైల్స్ అందుకుంది.

కానీ, ఇటీవల మరోసారి సాయం కోరగా, వచ్చిన పార్శిల్‌ను తెరిచిన కుటుంబ సభ్యులు అందులో 45 సంవత్సరాల గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం సగ భాగం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘోరానికి తోడు పార్శిల్‌లో బెదిరింపుతో కూడిన ఓ ఉత్తరం కూడా ఉండగా, రూ.1.30 కోట్లు చెల్లించాలని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ నయీం అస్మి స్వయంగా అక్కడికి చేరుకుని ఘటనపై సమీక్ష నిర్వహించారు. మృతదేహాన్ని పరిశీలించి, ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. పార్శిల్‌లోని లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు, బెదిరింపు వెనుక ఉన్న కారణాలను వెలికితీయటానికి ప్రయత్నిస్తున్నారు. మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసును క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.