జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి ఏకంగా బ్రిటన్-భారత్ దేశాల మధ్య కీలకమైన ఒప్పందం కూడా జరిగింది. ఒకే ఒక్క కేసులో కుదిరిన ఈ ఒప్పందానికి సంబంధించి రోజుల తరబడి ఇరు దేశాల ఉన్నతాధికారులు చర్చలు కూడా జరపడం మరింత విశేషం. దీంతో ఈ ఫిఫ్టీ-ఫిఫ్టీ జైలు శిక్ష కహానీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. నిజానికి ఒక ఖైదీని ఒక జైలు నుంచి మరో జైలుకు తరలించడమే పెద్ద పని. ఇక, ఒక రాష్ట్రం నుంచి మరోరాష్ట్రానికి ఒక కేసును బదిలీ చేయడం మరింత తలనొప్పి. అలాంటిది ఒకే ఒక్క ఖైదీ విషయంలో రెండు దేశాలు ఒప్పందం చేసుకోవడం అంటే మాటలా! అందుకే ఇది అంత ఇంట్రస్టింగ్ అయింది.
ఏం జరిగింది?
గుజరాత్‌లోని వల్సాదా ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. 2015లోనే చదువు, ఉపాధి నిమిత్తం బ్రిటన్‌కు వెళ్లిపోయాడు. దాదాపు అక్కడే స్థిరపడ్డాడు. అయితే.. యువకుడికి యుక్త వయసు వచ్చాక తల్లిదండ్రులు సంబంధాలు చూసే ప్రయత్నం చేశారు. కానీ, ఇంతలోనే సదరు యువకుడు.. భారత్‌కే చెందిన ఓ యువతిని బ్రిటన్‌లో ప్రేమించాడు. ఆమె కూడా.. సేమ్ రీజన్లతోనే భారత్ నుంచి బ్రిటన్‌కు వెళ్లింది. ఇలా.. కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత.. ఆమె తనను పెళ్లి చేసుకోవాలంటూ.. సదరు యువకుడిపై ఒత్తిడి తెచ్చింది. ఈ విషయాన్ని ఇంట్లో కూడా చెప్పిన యువకుడు తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకున్నాడు.
ఆ వెంటనే వారికి నిశ్చితార్ధం జరిగింది. కానీ, ఇంతలోనే సదరు యువతిపై అనుమానాలు పెంచుకున్నయువకుడు.. ఓ రోజు తన రూంకు పిలిచి దారుణంగా హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన బ్రిటన్ పోలీసులు విచారణ పూర్తి చేసి.. యువకుడిని దోషిగా తేల్చారు. ఈ క్రమంలో అతనికి బ్రిటన్ కోర్టు 28 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇక, అప్పటి నుంచి ఇప్పటివరకు అతను బ్రిటన్ లోని జైల్లోనే గడుపుతున్నాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు వెళ్లి పరామర్శించి వస్తున్నారు.
తర్వాత..
తమ ఏకైక బిడ్డ బ్రిటన్ జైల్లో ఉండడంతో తల్లిదండ్రులు కుంగిపోయారు. పైగా.. వృద్ధాప్య సమస్యలతోనూ వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమ కుమారుడు చేసిన నేరాన్ని అంగీకరిస్తూనే.. వృద్ధులుగా తమకు ఉన్న పెద్ద దిక్కు ఆ కుమారుడేనని.. ఈ సమయంలో తమ కుమారుడు తమ కళ్ల ముందే ఉంటే తమ ఆరోగ్యం బాగుంటుందని.. బ్రిటన్‌లో ఏ తరహా శిక్షను విధించారో.. అదే ఇక్కడ అమలు చేయాలని.. తద్వారా.. స్థానికంగా ఉంటే.. తాము పరామర్శించేందుకు వీలు అవుతుందని భారత విదేశాంగ శాఖను వేడుకున్నారు.
దీంతో భారత ప్రభుత్వం ప్రత్యేక నిబంధన కింద బ్రిటన్‌తో చర్చించి.. పెద్ద క్రతువునే పూర్తి చేసింది. సదరు యువకుడి మిగిలిన శిక్షను గుజరాత్‌లోనే అనుభవించేందుకు బ్రిటన్ అంగీకరించింది. దీనిపై ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందం కుదిరింది. తాజాగా బుధవారం ఆ యువకుడిని గుజరాత్‌లోని లాజ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక్కడి నుంచి అతని తల్లిదండ్రులు నివసిస్తున్న ఇల్లు కేవలం 14 కిలో మీటర్ల దూరంలో ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఒక కేసును మరో కోర్టుకు బదిలీ చేయడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఒక దేశంలో శిక్ష పడిన వ్యక్తిని మరో దేశానికితీసుకురావడం అంటే.. పెద్ద అంశమేనని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ తల్లిదండ్రులు ఈ విషయం సక్సెస్ అయ్యారని చెబుతున్నారు.