పాక్ కు హెచ్ఏఎల్ ఉద్యోగి గూఢచర్యం..అరెస్టు

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు పణంగా పెట్టి పహారా కాస్తుంటారు. వెన్నులో వణుకు పుట్టించే చలిని సైతం లెక్క చేయకుండా సియాచిన్ మంచుకొండల్లో గుండెను రాయి చేసుకొని సైనికులు కాపలా కాస్తుంటారు. మండుటెండలకు మలమల మాడిపోతున్నప్పటికీ దాయాది దేశం నీడకూడా మన దేశంపై పడకుండా పోరాడుతుంటారు సైనికులు. అయితే, ఇటువంటి సైనికుల త్యాగాలను నీరుగారుస్తూ కొందరు స్వార్థపరులు డబ్బుకోసం దేశ రక్షణను తాకట్టు పెడుతుంటారు. కాసులకు కక్కుర్తిపడి అత్యంత విలువైన సమాచారాన్ని దాయాది దేశానికి అమ్ముకుంటుంటారు.

గతంలో ఈ తరహా దేశద్రోహులు పట్టుబడినా….వారికి కఠిన శిక్షలు విధించినా….కొందరు వ్యక్తులు ఇంకా అటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని హెచ్ఏఎల్ కంపెనీలో పనిచేస్తోన్న ఓ ఉద్యోగి భారత ఫైటర్ జెట్ విమానాలకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి అమ్ముకున్న ఘటన కలకలం రేపింది. చివరకు ఆ దేశద్రోహి గుట్టు రట్టవడంతో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సిబ్బంది అతడిని కటకటాల వెనక్కు నెట్టారు.

నాసిక్ సమీపంలోని ఓజార్ లో ఉన్న హెచ్ఏఎల్ సంస్థలో ఫైటర్ జెట్ విమానాలు ఉత్పత్తి అవుతున్నాయి, ఆ సంస్థలో అసిస్టెంట్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్న దీపక్ శ్రీశాత్ ఫైటర్ విమానాలకు సంబంధించిన సమాచారాన్ని ఐఎస్ఐ కి పంపుతున్నాడు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన దేశ రక్షణ సమాచారాన్ని వాట్సాప్ , ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా పంపేవాడు. కార్యాలయంలో నిషిధ్ధ ప్రాంతాలు, ఫైటర్ జెట్ల వివరాలు, తదితర సమాచారమంతా అమ్ముతున్నాడు.

అయితే, ఇతడి వ్యవహారం బట్టబయలు కావడంతో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీపక్ నుంచి మూడు మొబైల్ ఫోన్లు, అయిదు సిమ్ కార్డులు, రెండు మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. దీపక్ తో పాటు మరెవరన్నా ఉన్నారా…దీపక్ ఇంకే సమాచారం చేరవేస్తున్నాడు…అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.